కోల్‌కతా సమీపంలో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య | Suvendu Adhikari Personal Secretary Shot Dead Near Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతా సమీపంలో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య

May 6 2026 11:59 PM | Updated on May 7 2026 4:39 AM

Suvendu Adhikari Personal Secretary Shot Dead Near Kolkata

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యంగ్రామ్‌ ప్రాంతంలో ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్‌ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్‌ రథ్‌ గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యారు. దోహారియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్‌ రథ్‌ ప్రయాణిస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో రథ్‌తో పాటు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్‌ను, డ్రైవర్‌ను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రథ్‌ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. 

ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రెండు రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మధ్యంగ్రాం నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి రథిన్ ఘోష్, ఇతను బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన 2,399 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.  

నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే తరుణ్‌జ్యోతి తివారీ మాట్లాడుతూ, ‘మేము నిరంతరం శాంతిని కోరుకుంటున్నాం, కానీ టీఎంసీ ఈ దారుణానికి ఒడిగట్టి అతిపెద్ద తప్పు చేసింది’.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించేందుకు, హత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం.   

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూ హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో సువేందు అధికారి, భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడించి 'జెయింట్ కిల్లర్' అనే పేరును సంపాదించారు. దాంతో సువేందు అధికారిని ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement