ఇటీవల కాలంలో కేంద్రం బలగాలు మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. అయితే లొంగిపోయిన నక్సల్స్‌ను పోలీసులు కీలక ఆపరేషన్ కోసం వాడుకుంటున్నారు. కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్ ఫేర్ కోసం మావోయిస్టులతో పోలీసులు శిక్షణ తీసుకోనున్నారు.
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులలో ఐఈడీలు, గెరిల్లా వ్యూహాలలో సిద్ధహస్తులైన డజనుకు పైగా మావోయిస్టులను కాంకేర్‌లోని సీటీజేడబ్ల్యూ కళాశాలకు పంపించారు. అక్కడ వారు పోలీసు అధికారులకు IED నిర్వహణ, గెరిల్లా యుద్ధ వ్యూహంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దానితో పాటు కొత్తగా నియమితమైన డీఎస్పీలకు, ఎస్సైలకు గెరిల్లా యుద్ధానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందిస్తారని బస్తర్ ఐజీ తెలిపారు.
మావోయిస్టుల కార్యక్రమాలపై పోలీసులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇదివరకే అడవిలో రహదారులపై అమర్చిన ఐఈడీలను గుర్తించడంలో నక్సలైట్లు ఎంతగానో సహాయపడ్డారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులు సాధారణంగా ఐఈడీలను అమర్చే క్రమంలో ఆకులను ఇతరాత్రా సహజ సంకేతాలను ఉపయోగిస్తారని వాటిని గుర్తించడంలో లొంగిపోయిన మావోయిస్టులు ఎంతగానో ఉపయోగపడుతారని తెలిపారు.
అయితే ఇటీవల లొంగిపోయిన 600 మంది మావోయిస్టులను బస్తర్‌లోని ఆరు పునారావాస కేంద్రాల్లో ఉంచుతున్నామని జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వారికి యోగా, కౌన్సిలింగ్, స్కిల్ డెవలఫ్‌మెంట్, ఉపాధి శిక్షణ తదితరాలు అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా సైకాలజిస్టుల పర్యవేక్షణలో వారి ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు.


