డీఎస్సీ పరీక్షపై స్టే ఇవ్వలేం | Supreme Court suggests petitioner to approach High Court over DSC exam | Sakshi
Sakshi News home page

డీఎస్సీ పరీక్షపై స్టే ఇవ్వలేం

Jun 13 2025 4:45 AM | Updated on Jun 13 2025 4:45 AM

Supreme Court suggests petitioner to approach High Court over DSC exam

హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించిన సుప్రీం కోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపా­ధ్యా­యుల నియామకానికి చేపట్టిన డీఎస్సీ–­2025 పరీక్షను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్ష ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున, తగిన న్యాయ సహాయానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌ పోసిన ఆనంద్‌సాయికి సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ రిజర్వేషన్‌ కోటాలో డీఎస్సీకి దర­ఖాస్తు చేసిన ఆనంద్‌ సాయి దాఖలు చేసిన పిటి­షన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. 

డీఎస్సీలో 5.72 లక్షల మంది అభ్యర్థులు వివిధ షిఫ్టులలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో పరీక్ష రాస్తారని, అనంతరం మార్కులు ‘నార్మలైజేషన్‌‘ పద్ధతిలో ఇవ్వడం అవాస్తవంగా, అన్యాయంగా ఉందని, ఇది అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని పిటిషనర్‌ తరఫున అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ డా. చారు మాథూర్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి. రాజు ఈ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. 

లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే పరీక్షలు రాశారని చెప్పారు. పరీక్షలు ప్రారంభమయ్యాక వాటిని మధ్యలో నిలిపేయాలని కోర్టులు ఆదేశించలేవని జస్టిస్‌ మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌ ఆనంద్‌సాయిని ధర్మాసనం ఆదేశించింది.   

Advertisement
 
Advertisement
Advertisement