సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్‌! | Supreme Court Stays Sringeri Recount Results Favouring Bjp Dn Jeevaraja | Sakshi
Sakshi News home page

సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్‌!

May 12 2026 11:19 AM | Updated on May 12 2026 11:37 AM

Supreme Court Stays Sringeri Recount Results Favouring Bjp Dn Jeevaraja

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై పశ్చిమ బెంగాల్‌లో రభస కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మే 11 అంటే సోమవారం సుప్రీంకోర్టులోనూ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ స్థానాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ దక్కించుకుంది. తీర్పు ఇస్తున్న సందర్భంగా ‘‘ప్రజాస్వామ్యం హైజాక్‌ అయ్యేందుకు అనుమతించం’’ అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది కూడా.. వివరాలు ఇలా ఉన్నాయి..

2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు  జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో శృంగేరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున టీటీ రాజేగౌడ, బీజేపీ తరఫున జీవరాజ్‌లు పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల కౌంటింగ్‌ తరువాత 201 ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి టీటీ రాజేగౌడ గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే.. జీవరాజ్‌ ఈ ఫలితాన్ని సవాలు చేశారు. విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది.

రిటర్నింగ్‌ అధికారి 562 ఓట్లను పునః పరిశీలించి బీజేపీ అభ్యర్థి జీవరాజ్‌ గెలుపొందినట్టుగా ప్రకటించారు. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. విషయం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ హైకోర్టు తీరును తప్పుపట్టింది. ఫలితాలను మార్చేసి కాంగ్రెస్‌ అభ్యర్థే శృంగేరి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే అని స్పష్టం చేసింది.

క్రిమినల్‌ కేసును విస్మరించారు...
హైకోర్టు తీర్పు ఒకలా.. సుప్రీంకోర్టు తీర్పు ఇంకోలా ఉండేందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే.. రీకౌంటింగ్‌ సందర్భంలో జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హైకోర్టు ఆదేశాలను మించి 562 ఓట్లను రీకౌంట్‌ చేయడం సమస్యకు కారణంగా మారింది. ఈ నెల రెండు మూడు తేదీల్లో రీకౌంటింగ్‌ జరగ్గా 279 ఓట్లకు బదులు 562 ఓట్లు రీకౌంట్‌ చేశారు. ఫలితంగా టీటీ రాజేగౌడకు పడ్డ ఓట్లు  248- 255 వరకూ తగ్గిపోయి జీవరాజ్‌ ఓట్లు స్వల్పంగా పెరిగాయి. సుమారు 52 - 66 ఓట్ల తేడాతో జీవరాజ్‌ గెలిచినట్టుగా రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

అంతకు ముందు అంటే 2023 ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంలోనూ తమకు పడ్డ బ్యాలెట్లను ఉద్దేశపూర్వకంగా చెల్లనివిగా చేశారని టీటీ రాజేగౌడ ఆరోపిస్తున్నారు. బ్యాలెట్‌ కాగితాలపై గీతలు పెట్టి, ఇంకు గుర్తులు పెట్టి చెల్లకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. స్ట్రాంగ్‌ రూమ్‌ తలుపుల తాళాలు, సీళ్లు చెదిరిపోయి ఉన్నాయని కూడా గుర్తించారు. కౌంటింగ్‌కు ముందే బ్యాలెట్‌ బాక్సులు తెరిచి ఉన్న విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలపై అప్పట్లోనే కలెక్టర్‌ కె.ఎన్‌.రమేశ్‌, రిటర్నింగ్‌ అధికారి వేదమూర్తి, బీజేపీ అభ్యర్థి జీవరాజ్‌లపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నింటిపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం. చివరకు సుప్రీంకోర్టు చొరవతో శృంగేరి అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌ వశమైంది.

పెద్ద ఎత్తున జరిగి ఉంటే...
శృంగేరి అసెంబ్లీ స్థానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ‍ప్రముఖ జర్నలిస్ట్‌ రవీశ్‌ కుమార్‌ స్పందించారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారి అక్రమాలకు పాల్పడుతూ కెమెరాకు చిక్కడం, హర్యానా పంచాయితీ ఎన్నికల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన ఈవీఎం రీకౌంటింగ్‌తో ఫలితాలు తారుమారైన విషయాన్ని, బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపే ప్రస్తావిస్తూ.... కర్ణాటక మాదిరిగానే దేశంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ రిటర్నింగ్‌ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికల విషయంలోనూ సుప్రీంకోర్టు సమీక్ష జరపాలని కోరారు. రిటర్నింగ్‌ అధికారులు తప్పు చేసి ఉంటే న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాల విషయంలో హెచ్చరించడం, లేదా ఖండించడం శిక్ష కిందకు రాదని వ్యాఖ్యానించారు.

:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

Advertisement
 
Advertisement
Advertisement