
సుప్రీంకోర్టు పనితీరుపై జస్టిస్ ఓకా ఆవేదన
పూర్తిగా సీజేఐ కేంద్రంగా కార్యకలాపాలు
హైకోర్టుల్లోనే మెరుగైన ప్రజాస్వామ్యం
వీడ్కోలు ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు
‘సీజేఐ–కేంద్రిత’ ఇమేజీని వదిలించుకోవాలి
పారదర్శకత, హేతుబద్ధత తక్షణావసరాలు
లిస్టింగ్ నుంచి పనితీరు దాకా కన్పించాలి
అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించాలి
కీలక సూచనలు చేసిన న్యాయమూర్తి
న్యూఢిల్లీ: ‘‘సుప్రీంకోర్టు చాలావరకు ప్రధాన న్యాయమూర్తిపైనే ఆధారపడి పని చేస్తోంది. అది సరికాదు. అత్యున్నత న్యాయస్థానం ‘సీజేఐ–కేంద్రిత’ ఇమేజీని తక్షణం వదిలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా అభిప్రాయపడ్డారు. ‘‘సుప్రీంకోర్టు ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దేశానికి ఎంతో సేవ చేసిందనడంలో సందేహం లేదు. కానీ ప్రజలు తనపై పెట్టుకున్న ఆకాంక్షలను మాత్రం నెరవేర్చలేకపోయిందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని చెప్పారు. ‘‘సుప్రీంకోర్టుకు ఇది ఉత్సవ సమయం కాదు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం’’ అని హితవు పలికారు. అంతేకాదు, సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల పనితీరే ప్రజాస్వామికంగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు!
‘‘హైకోర్టుల్లో తొలి ఐదు న్యాయమూర్తులతో కూడిన పాలక కమిటీ ఉంటుంది. అదే ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకుంటుంది. కమిటీలు, నిర్దారిత రోస్టర్ల ద్వారా హైకోర్టుల్లో కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. కానీ సుప్రీంకోర్టులో అలా కాదు. కార్యకలాపాలన్నీ ప్రధానంగా సీజేఐ ఆధారితంగా సాగుతాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘సుప్రీంకోర్టు అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించాలి. కేసుల లిస్టింగ్ పూర్తి పారదర్శకంగా జరగాలి.
లిస్టింగ్, కోర్టు కార్యకలాపాల నిర్వహణలో టెక్నాలజీ వాడకం మరింతగా పెరగాలి’’ అంటూ కీలక సూచనలు చేశారు. ఇవన్నీ ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ హయాంలోనే కార్యరూపం దాలుస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. జస్టిస్ ఓకా శుక్రవారం రిటైరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ పలు కీలకాంశాలను లేవనెత్తారు.
‘‘హైకోర్టులతో పోలిస్తే సుప్రీంకోర్టు తన పనితీరు విషయంలో సీజేఐపై విపరీతంగా ఆధారపడుతుంది. అక్కడ న్యాయమూర్తిగా చేసిన ఈ మూడేళ్లలో దీన్ని బాగా గమనించాను. సుప్రీంకోర్టులో దేశ నలుమూలల నుంచి వచ్చే 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. అలాంటప్పుడు సీజేఐ ఆధారిత ఇమేజీ ఏమాత్రమూ సరికాదు. సుప్రీంకోర్టు మరింత సమ్మిళిత, నిర్మాణాత్మక వ్యవస్థగా మారాల్సిన అవసరముంది’’ అని స్పష్టం చేశారు.
లిస్టింగ్ సమస్యలు
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ విషయంలోనూ తక్షణం పరిష్కరించాల్సిన అంశాలున్నాయని జస్టిస్ ఓకా చెప్పారు. ‘‘కొన్ని కేసులు మర్నాడే విచారణకు వస్తాయని, మరికొన్ని రోజుల తరబడి పెండింగ్‌లో ఉండిపోతాయని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. కేసుల లిస్టింగ్ విషయంలో హైకోర్టులు ఫిక్స్‌డ్ రోస్టర్‌ను పాటిస్తాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో పూర్తి పారదర్శక విధానాన్ని అనుసరించాలి’’ అని సూచించారు. ‘‘కేసుల లిస్టింగ్‌లో హేతుబద్ధత చాలా ముఖ్యం. వాటిని ఎవరూ వేలెత్తి చూపకుండా చూసుకోవాలి. మానవ ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తే తప్ప ఇది సాధ్యం కాదు.
ఇందుకు కృత్రిమ మేధ తదితర పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి. సుప్రీం కేవలం రాజ్యాంగ న్యాయస్థానం మాత్రమే కాదు. అపెల్లెట్ కోర్టు కూడా. కనుక రోజువారీ విధుల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత వంటివి చాలా ముఖ్యం’’ అని కుండబద్దలు కొట్టారు. న్యాయవ్యవస్థకు వెన్నెముక వంటి ట్రయల్, జిల్లా కోర్టులను హైకోర్టులు, సుప్రీంకోర్టు చిరకాలంగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయని జస్టిస్ ఓకా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టుల్లో 30 ఏళ్లుగా పెండింగ్ కేసులు భారీగా పేరుకుపోయాయని గుర్తు చేశారు.
వీడ్కోలు ప్రసంగాలు అంత ఈజీ కాదు
వీడ్కోలు ప్రసంగాలు రాసుకోవడం అంత సులువు కాదంటూ చమత్కరించారు. ‘‘గత రెండు వారాలు భా రంగా గడిచా యి. ఎన్నో తీర్పు లు రాయాల్సొచ్చింది. వాటిని బుధవారానికల్లా పూర్తి చేసి గురువారం వీడ్కోలు ప్రసంగం సిద్ధం చేసుకుందామనుకున్నా. కానీ ఊపిరి సలపని కార్యభారం వల్ల కుదరనే లేదు’’ అని చెప్పుకొచ్చారు. న్యాయమూర్తిగా రెండు దశాబ్దాల పై చిలుకు కెరీర్లో మెజారిటీ తీర్పుతో తాను ఎన్నడూ విభేదించలేదన్నారు. ఇప్పట్లో ఇంటర్వ్యూలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడేందుకు కాస్త సమయం కావాలన్నారు.
నమ్మకమిచ్చిన తీర్పరి
జస్టిస్ ఓకాపై సీజేఐ ప్రశంసలు
జస్టిస్ ఓకాకు సీజేఐ గవాయ్ భావోద్వేగభరింతగా వీడ్కోలు పలికారు. ఆయన తన తీర్పు లతో అసంఖ్యాకులకు న్యాయవ్యవస్థపై నమ్మ కం కలిగించారని కొనియాడారు. ‘‘దాదాపు సమాంతరంగా సాగిన కెరీర్లు మా ఇద్దరివీ. న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఆయన అపార ప్రజ్ఞ అందరినీ ఆకట్టుకుంది. ప్రతి వాదనకూ పూర్తిగా సంసిద్ధమై వచ్చేవారు. న్యాయమూర్తిగానూ అదే ఒరవడి కొనసాగించారు. రెండు రోజుల క్రితమే తల్లిని పోగొట్టుకున్నారు. అయినా అంత్యక్రియలు జరిగిన మర్నాడే విధులకు హాజరై 11 తీర్పులు వెలువరించారు. అంతటి అంకితభావమున్న అద్భుతమైన న్యాయమూర్తికి ఈ రోజు వీడ్కోలు పలుకుతున్నాం’’ అన్నారు. న్యాయమూర్తులతో పాటు యువ న్యాయవాదులకు జస్టిస్ ఓకా స్ఫూర్తిగా నిలుస్తారన్నారు.