
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై సుప్రీంకోర్టు ప్రశ్న
ఈ ప్రక్రియ రాజ్యాంగబద్ధమే.. చేపట్టిన సమయమే అసలు సమస్య
పిటిషనర్ల సందేహాలకు సమాధానం ఇవ్వండి
ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను యథాతథంగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని వెల్లడించింది. ప్రత్యేక సవరణను సవాలు చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఎన్నికల సంఘం తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. బిహార్‌లో 60 శాతం ఓటర్ల తనిఖీ పూర్తయ్యిందని చెప్పారు. ఓటర్లను సంప్రదించకుండా వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల సంఘం ఉద్దేశం, నిజాయతీని తాము శంకించడం లేదని, ప్రత్యేక సవరణ చేపట్టకుండా ఎన్నికల సంఘాన్ని అడ్డుకోవాలని భావించడం లేదని తెలిపింది.
ప్రత్యేక సవరణతో సమస్య లేదని, చేపట్టిన సమయమే అసలు సమస్య అని పేర్కొంది. తీరా అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించాల్సిన అవసరం ఏమిటని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ఆమోదిస్తున్నామని.. కానీ, ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టారో చెప్పాలని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది.
ఎన్నికలతో సంబంధం లేకుండా చేపట్టలేమా?
ఓటర్ల జాబితా సవరణ అనేది చాలా ముఖ్యమైన విషయమని చెప్పడంలో సందేహం లేదని, ఇది ప్రజాస్వామ్య మూలాలు, ఓటుకు ఉన్న శక్తికి సంబంధించిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్లు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని సూచించింది. ‘‘నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బిహార్‌లో ఈ సవరణ ప్రక్రియ ఇప్పుడే ఎందుకు ప్రారంభించారు? ఎన్నికలతో సంబంధం లేకుండా ఎందుకు చేపట్టకూడదు? ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందే ప్రారంభించడం వెనుక ఔచిత్యం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. ప్రత్యేక సవరణపై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని వెల్లడించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీ నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
పౌరసత్వం నిర్ధారణ మీ పనికాదు
ప్రత్యేక సవరణలో ఓటర్ల అర్హతను నిర్ధారించడానికి ఆధార్ కార్డును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 326 ప్రకారం ప్రతి ఓటర్ తప్పనిసరిగా భారతీయుడై ఉండాలని, ఆధార్ కార్డు అనేది ప్రజల పౌరసత్వానికి ధ్రువీకరణ కాదని రాజేశ్ ద్వివేది బదులిచ్చారు. ఓటర్ల పౌరసత్వాన్ని ధ్రువీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత కాదని, అది కేంద్ర హోంశాఖ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టంచేసింది. నిజంగా పౌరసత్వాన్ని తేల్చాలని అనుకుంటే ఆ ప్రక్రియను గతంలోనే ప్రారంభిస్తే బాగుండేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొంది. అందుకే అర్హులైన ఓటర్లను నిర్ధారించడానికి ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డును సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
