ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఢమాల్‌!

Student loses IIT Bombay seat due to wrong click - Sakshi

సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థి

ముంబై: ఆల్‌ ఇండియా జేఈఈ పరీక్షలో 270వ ర్యాంకు పొందిన ఒక యువకుడు ఒక్క తప్పిదంతో ప్రఖ్యాత ఐఐటీలో ఇంజనీరింగ్‌ సీటు కోల్పోయాడు. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్‌ బత్రాకు తల్లీ తండ్రీలేరు. కష్టపడి చదవి జేఈఈలో మంచి ర్యాంకు సంపాదించాడు. ఐఐటీ బోంబేలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో సీటు సైతం సంపాదించాడు. అయితే అక్టోబర్‌ 31న తన రోల్‌నెంబర్‌పై అప్‌డేట్ల కోసం నెట్‌లో బ్రౌజ్‌ చేస్తుండగా ఒక లింక్‌ను అనుకోకుండా క్లిక్‌ చేశాడు. ‘‘విత్‌ డ్రా ఫ్రం సీట్‌ అలకేషన్‌ అండ్‌ ఫరదర్‌ రౌండ్స్‌’ అని ఉన్న లింక్‌ను తను క్లిక్‌ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్‌ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్‌ను క్లిక్‌ చేసినట్లు బత్రా చెప్పారు.

దీంతో ఆయనకు నవంబర్‌ 10న విడుదలైన అడ్మిటెడ్‌ స్టూడెంట్స్‌ లిస్టు చూశాక షాక్‌ తగిలింది. ఆయన పేరు 93మంది విద్యార్దుల తుది జాబితాలో లేదు. దీంతో ఆయన బాంబే హైకోర్టులో పిటీషన్‌ వేశారు. 19న పిటిషన్‌ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్‌ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్‌డ్రా లెటర్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ ఈ నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిషన్లన్నీ జేఒఎస్‌ఎస్‌ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్‌ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు.

వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. దీంతో ఈ విషయంపై బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టం పూడ్చేందుకు అదనపు సీటు కేటాయించాలని కోరుతున్నారు. తాను కేవలం సీటు దొరకడం వల్ల ఇకపై అడ్మిషన్‌ ప్రక్రియ ఉండదన్న అంచనాతో ఫ్రీజ్‌ లింక్‌ను క్లిక్‌ చేశానని కోర్టుకు చెప్పారు. అయితే విత్‌డ్రా చేసుకోవడం రెండంచెల్లో జరుగుతుందని, విద్యార్థి ఇష్టపూర్వకంగానే సీటు వదులుకున్నట్లు భావించాలని, ఆ మేరకు సదరు విద్యార్థ్ధికి రూ.2వేలు మినహాయించుకొని సీటు కోసం తీసుకున్న ఫీజు రిఫండ్‌ చేస్తామని ఐఐటీ పేర్కొంది. సీట్లు వృథా కాకుండా ఈ విధానం తెచ్చినట్లు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top