
న్యూఢిల్లీ: ఉగ్రదాడికి తగిన ప్రతీకారం తీర్చుకునే విషయంలో భారత నెగ్గిందని, ఉగ్రవాదం ఓడిందని.. దృఢ సంకల్పం, దూరదృష్టి గల నాయకత్వం ఇందుకు సారధ్యం వహించిందని ఎన్డీఏ తీర్మానించింది. ఆపరేషన్ సిందూర్, మహాదేవ్‌లో సైనికుల శౌర్యానికి ఎన్డీఏ సభ్యులు అభినందనలు తెలిపారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎన్డీఏ ఎంపీలు సంతాపం వ్యక్తం చేశారు.
నేడు (మంగళవారం) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నిర్వహించిన సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్‌లు విజయవంతమైన నేపధ్యంలో సభ్యులు ప్రధాని మోదీని హర్షద్వానాలతో ఆహ్వానించారు. ‘హర్ హర్ మహాదేవ్’అంటూ నినాదాలు కూడా చేశారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు మోదీని ఘనంగా సత్కరించారు.
#WATCH | Delhi: PM Narendra Modi was welcomed and felicitated with a thunderous applause amid chants of 'Har Har Mahadev', after the success of Operation Sindoor and Operation Mahadev, at the NDA Parliamentary Party Meeting. pic.twitter.com/DO4SjNPOAh
— ANI (@ANI) August 5, 2025
ఆపరేషన్ సిందూర్‌పై ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం ప్రత్యేక తీర్మానం చేసింది. అనంతరం లైబ్రరీ బిల్డింగ్ నుంచి పార్లమెంట్ కి ఎన్డీఏ ఎంపీలు మార్చ్ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీని ఎన్డీయే ఎంపీలు సన్మానించారు. పీఎం మోదీ నేతృత్వాన్ని ఎన్డీఏ సభ్యులు ప్రశంసించారు. కాగా ఏప్రిల్ 22న పాకిస్తాన్ టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో దారుణ దాడికి పాల్పడి,26 మందిని దారుణంగా హత్య చేశారు. ఈ నేపధ్యంలో ‘భూమి పై ఎక్కడ ఉన్నా ఉగ్రవాదుల్ని వెతికి, శిక్షిస్తాం’ అంటూ ఏప్రిల్ 24న ప్రధాని మోదీ హెచ్చరించారు.ఆ హెచ్చరిక మే 6-7 మధ్య రాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ గా కార్యరూపం దాల్చింది. పాక్, పీఓకేలో ఉగ్ర శిబిరాలపై కచ్చితమైన దాడులు జరిగాయి. ఉగ్రదాడికి తగిన ప్రతీకారం జరిగింది. భారత నెగ్గింది. ఉగ్రవాదం ఓడింది అని ఎన్డీఏ తీర్మానం చేసింది.
