ఒక చావు.. కొందరిని కుంగదీస్తుంది. కుమిలిపోయేలా చేస్తుంది. అదే చావు.. మరికొందరికి మాత్రం కాసుల పంట పండిస్తుంది. ‘శవాల మీద పేలాలు ఏరుకుని తినే నీచులు..’ అంటూ.. మానవత్వం లేని మనుషుల గురించి మనం తిట్లు వింటూ ఉంటాం. కానీ.. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే.. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా ఉంటూ.. లంచాలు తెగమేసి బతకడానికి అలవాటుపడిన దుర్మార్గులు.. ఈ తరహా అమానవీయ పోకడల విషయంలో ఎంతటి మాస్టర్ డిగ్రీలు చేశారో అర్థమవుతుంది.
తాము లంచాలు కాజేయడం మాత్రమే వారికి ప్రయారిటీ! సందర్భం ఏదైనా సరే వారికి పట్టింపులేదు. అవతలి వారు ఎంతటి దారిద్ర్యంలో ఉన్నారో, ఎంతటి వేదనలో ఉన్నారో కూడా వారికి అక్కర్లేదు. లంచాలు మింగడం మాత్రమే కాదు.. వేదనలో ఉన్న వారిని పరుషవ్యాఖ్యలతో నొప్పించడం వారి దుర్మార్గానికి మరింత పరాకాష్ట. ఆధునిక సమాజంలో మానవీయ విలువలు పూర్తిగా కనుమరుగైపోయాయని మనం చెప్పలేం. కాకపోతే.. ఇలాంటి ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు మాత్రం ఆ మానవీయతకే తీరని కళంకం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.
వివరాల్లోకి వెళితే..
బెంగుళూరులో ఒక వేదనాభరితమైన దుర్ఘటన చోటుచేసుకుంది. బీపీసీఎల్ సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్‌గా పనిచేసిన 64 ఏళ్ల కె శివకుమార్ జీవితంలో చోటుచేసుకున్న విషాదం అది. ఆయనకున్న ఏకైక కూతురు అక్షయ శివకుమార్ (34). ఐఐటీ నుంచి బిటెక్ చేసింది, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీయే చేసింది. ఓ మల్టినేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విషాదం ఏంటంటే.. ఇటీవల ఆమె బ్రెయిన్ హెమరేజ్ తో దుర్మరణం పాలైంది. అసహజ మరణంగా గుర్తించడంతో మెడికో లీగల్ కేసు నమోదు అయింది. ఒక చావు సంభవిస్తే.. అనుబంధాలను పెనవేసుకున్న వందల వేల హృదయాలు దుఃఖిస్తాయి. ఇలాంటి చావు సంభవించినప్పుడు.. దాని నుంచి డబ్బులు ఏరుకోవడానికి పదుల సంఖ్యలో పరాన్నభుక్కుల వంటి కుక్కలు సదా సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి దుర్మార్గాలు, శివకుమార్‌కు వరుసగా స్వానుభవంలోకి వచ్చాయి.
అంబులెన్సులో ఆస్పత్రికి, శ్మశానానికి తరలించే వాడికి ఓ రేంజి లంచం, కేసు రిజిస్టరు అయింది గనుక.. బెలందూరు పోలీసు వారికి లంచం, అంతా పూర్తయి కూతురు డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటే.. బెంగుళూరు నగరపాలిక సంస్థ వారికి లంచం.. ఈ వ్యవహారాలతో అసలే దుఃఖంలో ఉన్న ఆయన మరింతగా క్షోభకు గురయ్యారు. లంచాలు డిమాండ్ చేయడం మాత్రమే కాదు.. ఉన్న ఒక్కగానొక్క కూతురును కోల్పోయి పుట్టెడు బాధలో ఉంటే.. లంచం కోసం బెలందూరు పోలీసులు దూషించిన తీరు కూడా ఆయన క్షోభను మరింతగా పెంచింది. ఈ గోడు మొత్తం వెళ్లగక్కుతూ ఆయన ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. ఇలాంటి వారి బారిన పడి.. ఎన్ని వేల లక్షల హృదయాలు ఎంతగా క్షోభిస్తూ ఉంటాయో.. ఆ పోస్టు కాస్తా వైరల్ అయింది. పోలీసు పెద్దలు కొంచెం జాగ్రత్త పడి.. బెలందూరు స్టేషన్లో ఇద్దరిని సస్పెండ్ చేశారు.
లంచగొండితనం అనేది ఇవాళ్టి సమాజంలో ఒక యాక్సెప్టబుల్ వ్యవహారం అయిపోయింది. గవర్నమెంటుతో ముడిపడిన ఈ పని మనకు ఉన్నా.. తృణమో పణమో అడక్కముందే సమర్పించేసుకోవడం సాధారణ జనానికి అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇలా పుట్టే డబ్బులు పుట్టెడు ఉంటాయి. అలాగని ఒకరో ఇద్దరో దారిద్ర్యంలో పడి అలమటిస్తున్న వారు.. డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. ఈ లంచగొండులు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో, బాధాకరమైన వేళల్లో కూడా తమ దందా తాము సాగించాలనే అనుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.
‘నేనంటే డబ్బున్న వాణ్ని గనుక.. అందరికీ అడిగినంత లంచాలు ముట్టజెప్పాను. డబ్బులేని పేదల పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆ శివకుమార్ తన పోస్టులో ప్రశ్నించిన తీరు.. సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ఈసడించుకున్నంత మాత్రాన.. కించిత్తు కూడా ఈ లంచగొండి అవతారాల్లో మార్పు రాదన్నది నిజం. ఎందుకంటే.. ఆస్పత్రుల్లో లంచాలు, తప్పుడు చికిత్సలు, పోలీసుల లంచాలు, నీతిమాలిన వైనం గురించి.. కొన్ని వందల సినిమాల్లో ఘాటుగా చర్చిస్తూనే వచ్చారు. ఏం మారింది సమాజం? అలా లంచం తీసుకోవడాన్ని ఒక లాంఛనంగా, అధికారిక క్రతువులాగా మార్చేసుకుంటున్నారు. కేవలం ఒకటిరెండు సస్పెన్షన్లతో ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట పడుతుందా? ఆ అంబులెన్సు డ్రైవరూ, ఆ ఆసుపత్రి సిబ్బంది, శ్మశానం సిబ్బందీ, బెంగుళూరు కార్పొరేషన్ పెద్దలూ, పోలీసు మహానుభావులూ అందరివీ పత్రికల్లో పెద్దపెద్ద ఫోటోలు వేసి.. చావుల మీద లంచాల డబ్బులు ఏరుకుంటున్న నీచులు వీళ్లేనని తగుమాత్రం ప్రచారం కల్పించాలి. సోషల్ మీడియా లో ఫోటోలతో సహా వారి నీచత్వాన్ని డప్పు కొట్టి మరీ చెప్పాలి. నగరమంతా పోస్టర్లు వేయాలి. వారి బతుకుల్లో సిగ్గు పుట్టించాలి. లేకపోతే ఇలాంటి అరాచకత్వాలకు నిష్కృతి లేదు.
..ఎం.రాజేశ్వరి


