కర్ణాటకలో అధికారం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరో కీలక రాజకీయ అడుగు వేశారు. రాజీనామా చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్న సమయంలోనే వెనుకబడిన వర్గాల కమిషన్ కులగణన సర్వే నివేదికను ఆయన ఆమోదించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదని.. తన రాజకీయ వారసత్వాన్ని బలపరచుకునే వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితుల సమీకరణమైన ‘అహిందా’ రాజకీయాలతో ఎదిగిన సిద్దరామయ్య.. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న నాయకుడిగా తన ఇమేజ్‌ను చివరి వరకూ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీఎం పదవి నుంచి తప్పుకునే ముందు కులగణన రిపోర్ట్‌ను ఆమోదించడం ద్వారా.. వెనుకబడిన వర్గాల పక్షాన నిలిచే నేతగా తన ముద్ర మరింత బలపడేలా చూసుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అయితే అసలు రాజకీయ ట్విస్ట్ ఇక్కడే ఉంది. రిపోర్ట్‌ను ఆమోదించడం మాత్రమే సరిపోదు.. దానిని అమలు చేయాలంటే కొత్త ప్రభుత్వం కేబినెట్‌లో ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే.. ఈ నివేదికపై నిర్ణయం తీసుకోవడం ఆయన ప్రభుత్వానికి పెద్ద రాజకీయ పరీక్షగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే లింగాయత్, వొక్కలిగ వర్గాలకు చెందిన పలువురు నేతలు ఈ కులగణనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో రిపోర్ట్‌ను అమలు చేస్తే ఆధిపత్య వర్గాల అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంది.
మరోవైపు దానిని తిరస్కరించినా లేదా ఆలస్యం చేసినా.. వెనుకబడిన వర్గాలు, అహిందా వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. దీంతో సిద్దరామయ్య ఒకవైపు సామాజిక న్యాయ రాజకీయాలకు కట్టుబడి ఉన్న నాయకుడిగా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకుంటూనే.. ఇదే సమయంలో తదుపరి ప్రభుత్వానికి రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితిని వదిలి వెళ్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


