రాజీ కుదిరాక కేసులెందుకు?  | Settlement has been entered into, the complainant cannot pursue the original complaint | Sakshi
Sakshi News home page

రాజీ కుదిరాక కేసులెందుకు? 

Jun 2 2026 1:06 AM | Updated on Jun 2 2026 1:06 AM

Settlement has been entered into, the complainant cannot pursue the original complaint

సుప్రీంకోర్టు కీలక తీర్పు 

సాక్షి, న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరిన తర్వాత కూడా కక్షిదారులు క్రిమినల్‌ కేసులను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగ పర్చడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ వివాదంపై దిగువ కోర్టు సూచనల మేరకు ఇరుపక్షాలు మధ్యవర్తిత్వ కేంద్రంలో రాజీకి వచ్చాయి. లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాజీ షరతుల ప్రకారం నడుచుకున్నప్పటికీ.. తనపై పెట్టిన చీటింగ్‌ కేసును వెనక్కి తీసుకునేందుకు ఎదుటి పక్షం నిరాకరిస్తోందంటూ పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

తన క్లయింట్‌ను వేదించాలనే ఉద్దేశంతోనే ఎఫ్‌ఐఆర్‌ను కొనసాగిస్తున్నారంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఒప్పందంలోని కొన్ని షరతులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, అందుకే కేసును వెనక్కి తీసుకోలేదని ప్రతివాది పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు, మధ్యవర్తిత్వ కేంద్రం సమర్పించిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం ..కోర్టుల సమయాన్ని ఆదా చేయడానికి, కేసుల సత్వర పరిష్కారం కోసమే మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నామని తెలిపింది. 

ఇరుపక్షాలు స్వచ్ఛందంగా రాజీ ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత, అందులోని షరతులకు తప్పక కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కేసులను వెనక్కి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కొనసాగించడం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలు కేవలం కక్ష సాధింపు చర్యల కిందకే వస్తాయని, న్యాయపరమైన ప్రయోజనం ఏమీ ఉండదని అసహనం వ్యక్తం చేసింది.

 ఈ కేసును కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. పిటిషనర్‌పై నమోదైన చీటింగ్‌ ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజీ ఒప్పందంలోని షరతులను ఇరుపక్షాలు నిరీ్ణత వ్యవధిలోగా తూచా తప్పక పాటించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి కొత్త ఫిర్యాదులు, క్రిమినల్‌ కేసులు దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ధర్మాసనం విచారణను ముగించింది.   

Advertisement
 
Advertisement
Advertisement