గాడిదలకు సీమంతం.. ఆశ్చర్యంగా ఉందే..! వీడియో వైరల్‌

Seemantham For Donkeys In Rajkot Gujarat - Sakshi

గుజరాత్‌: గాడిదలకు సీమంతం ఏంటి.. ఆశ్చర్యంగా ఉందే అనుకుంటున్నారా?. ప్రత్యేక జాతి అయిన హలరీ గాడిదలు అంతరించిపోయే ప్రమాద జాబితాలో ఉండటంతో వాటికి కాపాడుకునేందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రజలు వినూత్నంగా ఆలోచించారు. అప్పుడే పుట్టిన గాడిద పిల్లలకు బారసాల నిర్వహించడంతో పాటు, గర్భం దాల్చిన వాటికి సీమంతం చేస్తున్నారు. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, వీటి సంఖ్యను పెంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

గుజరాత్‌లో ఈ జాతికి చెందిన గాడిదలు కేవలం 450 మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి పాలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో అంతరించిపోతున్న ఈ  జాతి గాడిదల ధరలు ఒక్కొక్కటి సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంది.  ఈవీ అంతరించిపోకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఈ జాతిని రక్షించడానికి,  ప్రోత్సహించడానికి సింబయాసిస్ సంస్థ కూడా చర్యలు  తీసుకుంటుంది.

ఇటీవల రాజ్‌కోట్ జిల్లా ఉప్లేటా తాలూకాలోని కోల్కి గ్రామంలో హలరీ జాతి గాడిద ఈనడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గర్భం దాల్చిన మరో 33 గాడిదలకు సీమంతం కూడా చేశారు. నుదుటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజలు చేసి, ఆహారం పెట్టారు. హలారి గదర్భ సంవర్ధన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆడ గాడిదలకు తిలకం, కుంకుమ, బియ్యం, గులాబీ చున్నీ (దుపట్టా), పూల దండలు సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా వచ్చారు.
చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్‌..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top