న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఇటీవల కోర్టు హాల్లో షూ విసిరిన సస్పెండెడ్ లాయర్ రాకేశ్ కిశోర్(71)పై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఆ లాయర్‌పై ధిక్కారం కింద చర్యలు తీసుకునేందుకు సీజేఐ గవాయ్ విముఖంగా ఉన్నారని తెలిపింది.
కోర్టు గదిలో నినాదాలివ్వడం, చెప్పులు విసరడం వంటి చర్యలు కచ్చితంగా ధిక్కారంగానే పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంలోనూ చర్యలు తీసుకోవాలా వద్దా అనేది సంబంధిత న్యాయమూర్తి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కోర్టు ధిక్కారంగా భావించిన పక్షంలో ఆ న్యాయవాదికి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని, ఆ ఘటన ప్రభావం పెరుగుతుందని అభిప్రాయపడింది. అప్పటి ఘటన దానంతటదే మరుగున పడిపోవడమే సరైనదని కూడా ధర్మాసనం పేర్కొంది.
భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగు మార్గదర్శకాలను రూపొందిస్తామంది. ఇప్పటి వరకు వివిధ కోర్టుల్లో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనల వివరాలను అందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది.
అక్టోబర్ 6వ తేదీన కేసుల లిస్టింగ్ జరుగుతున్న సమయంలో సీజేఐపై రాకేశ్ కిశోర్(71) అనే లాయర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనను కోర్టు ధిక్కారంగా భావించి చర్యలు చేపట్టాలంటూ సుప్రీం బార్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.


