
న్యాయం దక్కడం ఆలస్యం ఐతే అసలు అది న్యాయమే కాదు.. అది దక్కినట్లే కాదన్నది భారత న్యాయ సూత్రం.. బాధితులు.. పీడితులు.. ఎవరైనా సరే వారికి సమయాన్ని బట్టి న్యాయం అందాల్సిందే.. లేకుంటే వారికి జరిగే నష్టానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గతంలో ఎన్నోసార్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇప్పుడు అదే క్రమంలో ఒక కేసు విషయంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక ముద్దాయికి న్యాయం సరిగా అందనందుకు ఏకంగా రూ. 25 లక్షల పరిహారం చెల్లించేలా ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
తన శిక్షా కలం పూర్తయినా విడుదల కాకుండా నాలుగేళ్ల ఏడు నెలలు అదనంగా జైల్లో మగ్గిపోయిన ఒక ఖైదీకి సుప్రీంకోర్టు న్యాయం చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ నేరస్తుడికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2005లో జరిగిన అత్యాచార కేసులో సోహన్ సింగ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, 2017లో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు మార్చి, సాక్ష్యాలలో లోపాలు ఉన్నందున అతని శిక్షను కేవలం 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా తగ్గించింది.
అయినప్పటికీ, హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో సింగ్ జూన్ 2025 వరకు జైల్లోనే ఉండిపోయాడు. బెయిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా, అతను నాలుగేళ్ల ఏడు నెలలు ఎక్కువ శిక్ష అనుభవించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ జె.బి. పార్డివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మధ్యప్రదేశ్ రాష్ట్ర నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున వకీళ్లు తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించడం పైనా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నిర్లక్ష్యం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగకరంగా వ్యాఖ్యానించింది.
అలాగే, రాష్ట్రంలోని అన్ని జైళ్లను సమగ్రంగా పరిశీలించి, మరెవరూ ఇలాంటి అక్రమ నిర్బంధానికి గురికాకుండా చూడాలని మధ్యప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయన జైల్లో కోల్పోయిన జీవిత కాలాన్ని ఎవరూ తిరిగి తెచ్చివ్వలేరని పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది.. ఈ క్రమంలో ఆయనకు రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మధ్య ప్రదేశ్ రాష్ట్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పును ఒక మైలు రాయిగా న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ దిశగా సుప్రీం కోర్టు వేసిన అడుగు ఒక గొప్ప ముందడుగు అని వారు అంటున్నారు..
, సిమ్మాదిరప్పన్న