పట్నా: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేయనున్నారు.
ఏప్రిల్ 14వ తేదీన బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేస్తారు. అనంతరం కొత్త సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఏప్రిల్ 15న సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతుండడం బిహార్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వల్ల నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోతారని, రాష్ట్రంలో ఆయన పార్టీ ప్రభావం తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు.
2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్‌ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి.. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.


