‘‘అప్పటివరకు ‘నీట్‌’పై నిరసనలు జరుగుతూనే ఉంటాయి’’ | Rahul Gandhi seeks Dharmendra Pradhan resignation | Sakshi
Sakshi News home page

‘‘అప్పటివరకు ‘నీట్‌’పై నిరసనలు జరుగుతూనే ఉంటాయి’’

May 24 2026 4:31 PM | Updated on May 24 2026 5:00 PM

Rahul Gandhi seeks Dharmendra Pradhan resignation

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో ఉండగా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఆదివారం ఎక్స్‌లో ఈ మేరకు రాహుల్‌ గాంధీ ఎన్‌ఎస్‌యూఐ నిరసన తెలిపిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. “లక్షలాది మంది యువత రోడ్లపై ఉన్నారు.. 22 లక్షల పిల్లల భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. అయినా ప్రధాని మౌనంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడంపై కాదు, బాధ్యత నుంచి తప్పించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, నీట్ లాంటి ప్రశ్నపత్ర లీకులు ఆగేలా పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు మేము ఆగము” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని, “ప్రశ్నపత్ర లీక్ మాఫియా” పెరగడానికి అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.

ఎక్స్‌లో కాంగ్రెస్ ట్వీట్‌ చేస్తూ.. “నీట్ ప్రశ్నపత్ర లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను చీకటిలోకి నెట్టింది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్ర లీక్ మాఫియా విస్తరిస్తోంది. బాధ్యులు మాత్రం మౌనంగా చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వినోద్‌ జాఖర్‌ నాయకత్వంలో కార్యకర్తలు పాదయాత్ర చేపట్టి, యువత వ్యతిరేక మోదీ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌తో చేసే ఈ చెలగాటాన్ని ఏ మాత్రం సహించం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కాంగ్రెస్ పేర్కొంది.

అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రశ్నపత్ర లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఇదిలా ఉండగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.

నిరసనకారులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement