వాళ్లు మనోవేదనలో మీరు రీల్స్‌ మోజులో  | Rahul Gandhi Questions PM Narendra Modi Over Exam Paper Leaks And Student Protests, More Details Inside | Sakshi
Sakshi News home page

వాళ్లు మనోవేదనలో మీరు రీల్స్‌ మోజులో 

May 22 2026 6:27 AM | Updated on May 22 2026 10:56 AM

Rahul Gandhi Questions PM Narendra Modi Over Exam Paper Leaks

నీట్‌ పరీక్ష లీకేజీ వేళ మోదీ ‘మెలోడీ’ రీల్స్‌పై రాహుల్‌ మండిపాటు

న్యూఢిల్లీ: భవిష్యత్తును నిర్ణయించే నీట్‌–యూజీ పరీక్షను రాత్రింబవళ్లు కష్టపడి చదివి రాశాక అది రద్దయిందని తెలిసి లక్షలాది మంది అభ్యర్థులు వేదనలో మునిగిపోతే విదేశాల్లో ప్రధాని మోదీ ‘రీల్స్‌’చేస్తూ సంతోషంగా కన్పిస్తున్నారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. రాహుల్‌ గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ఖాతాలో మోదీ వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

 ‘‘పేపర్‌లీక్‌ ఉదంతంలో న్యాయం కావాలంటూ ఓవైపు యువత వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే మోదీ ఇటలీలో మెలోడీ అంటూ రీల్స్‌చేస్తున్నారు. దేశంలో ఎక్కడ మంచి పని జరిగినా తన ఘనతే అని చెప్పుకుని తిరిగే మోదీ నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ అయితే బాధ్యత ఎందుకు తీసుకోవట్లేరు? కనీసం నీట్‌–యూజీ పరీక్షల నిర్వహణను కేంద్రస్థాయిలో చూసుకునే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎందుకు ఇంకా పదవి నుంచి తొలగించలేదు? ఈ విషయంపై మోదీ ఎందుకు ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు? న్యాయం కోరుతూ పలు రాష్ట్రాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచిన ఎస్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్‌ కార్యకర్తలపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు లాఠీల వర్షం కురిపిస్తున్నాయి. 

లాఠీలతో ప్రభుత్వం చెప్పే సమాధానం ఏరకంగానూ జవాబుదారీ అన్పించుకోదు. సమాధానం చెప్పే ధైర్యంలేక భయంతో మమ్మల్ని లాఠీలతో చావబాదుతున్నారు. అయినా మేం భయపడబోం. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించేదాకా, దేశంలో పేపర్‌ లీకేజీలులేని పటిష్టమైన పరీక్షా విధానం అమల్లోకి వచ్చేదాకా ఉద్యమిస్తాం. లీకేజీలతో విద్యార్థుల భవితను ప్రభుత్వం దోచుకుంటోంది’’అని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. జైపూర్‌లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యమిస్తున్న విద్యార్థులపైకి పోలీసులు లాఠీచార్జ్‌ చేస్తున్న ఫొటోను రాహుల్‌గాంధీ ఈ పోస్ట్‌కు ట్యాగ్‌చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement