
ఆనంద్: ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పక్షపాత ఎంపైర్‌గా పనిచేస్తోందని క్రికెట్ పరిభాషలో మండిపడ్డారు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎన్నికల సంఘమే కారణమని విమర్శించారు. అప్పట్లో తప్పుడు ఓటర్ల జాబితాను ఈసీ రూపొందించిందని ఆక్షేపించారు. క్రికెట్‌లో మనం తప్పులు చేయకపోయినా పదేపదే ఔట్ అవుతున్నామంటే అందుకు అంపైర్ పక్షపాత వైఖరే కారణమవుతుందని చెప్పారు.
శనివారం గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో ‘సంఘటన్ సుజన్ అభియాన్’లో రాహుల్ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ఒక దేవాలయంగా అభివర్ణించారు. అక్కడికి ఎవరైనా వచ్చి ప్రార్థనలు, పూజలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ, ప్రసాదం ఎవరికి దక్కాలన్నది బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయిస్తున్నాయని ఆక్షేపించారు. గుజరాత్‌లో అధికార బీజేపీని కచి్చతంగా ఓడించాలని, అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. గుజరాత్‌లో ఆ పార్టీని మట్టికరిపిస్తే కాంగ్రెస్‌కు ఇక తిరుగుండదని తేల్చిచెప్పారు. బీజేపీని గుజరాత్‌లో ఓడిస్తే ఎక్కడైనా ఓడించడం సులభమేనని సూచించారు. ‘మిషన్ 2027’రోడ్‌మ్యాప్‌పై ఈ కార్యక్రమంలో చర్చించారు.