జనంపై ‘ఎన్నికల బిల్లు’  | Congress Slams LPG Price Hike, Rahul Gandhi Calls It An Election Bill And Warns Of Rising Inflation Burden On Common People | Sakshi
Sakshi News home page

జనంపై ‘ఎన్నికల బిల్లు’ 

May 2 2026 6:30 AM | Updated on May 2 2026 10:47 AM

Rahul Gandhi Attacks Modi Govt Over Commercial LPG Price Hikes

వాణిజ్య ఎల్పీజీ ధర పెంపుపై రాహుల్‌ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపుపట్ల కేంద్రంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అధికార పార్టీకి ఎన్నికల సమయంలో మాత్రమే సామాన్య ప్రజలు గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వారి మానాన వారిని వదిలేస్తారని మండిపడింది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర పెంపు ఒక ‘ఎన్నికల బిల్లు’అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తరువాతి బాదుడు పెట్రోల్, డీజిల్‌పై ఉంటుందన్నారు. 

ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం వేడి తగులుతుందని తాను ముందే హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఈ రోజు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధర రూ.993 పెరిగింది. అతిపెద్ద పెంపు ఇదే. ఇది ఒక ఎన్నికల బిల్లు. కేవలం మూడు నెలల్లో రూ.1,380 పెరిగింది, ఇది 81% పెరుగుదల. టీ స్టాళ్లు, ధాబాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్‌ షాపులు, రెస్టారెంట్లు ప్రతి వంటగదిపై భారం పెరిగింది.

 ఇది అనివార్యంగా సాధారణ ప్రజలపై ప్రభావం చూపుతుంది’అని రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ధరలు పెంచబోమని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయారని ఎద్దేవా చేశారు. వాణిజ్య సిలిండర్లపై దాదాపు రూ.1000 భారీ పెంపు, జీవనాధారం కోసం చిన్న భోజనశాలలపై ఆధారపడే కోట్లాది మంది భారతీయులను ప్రభావితం చేస్తుందని, కోట్లాది మంది ఈ పెంపు భారాన్ని మోయవలసి వస్తుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు.  

ఏప్రిల్‌ 29న అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయని రాహుల్‌ గాంధీ ముందే హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం సొమ్ము చేసుకుందని, ధరలు పెరుగుతున్నందున ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ‘ఎన్నికల ఉపశమనం ముగిసింది. ద్రవ్యోల్బణం వేడి రాబోతోంది! ఏప్రిల్‌ 29 తర్వాత జాగ్రత్త – పెట్రోల్, డీజిల్, ప్రతీదీ ఖరీదైపోతుంది. ముడిచమురు చౌకగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం లాభాలను జేబులో వేసుకుంది. ఇప్పుడు అది ఖరీదై, ఆ భారాన్ని మీపై మోపుతుంది’అని రాహుల్‌ గాంధీ మంగళవారం ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement