నాలుగు దేశాల క్వాడ్ కూటమి నిర్ణయం
1.91 లక్షల కోట్లతో ‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమం’ఖరారు
ఇండో–పసిఫిక్‌లో సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలు బలోపేతం
క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో తీర్మానం
న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతుల విషయంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి నాలుగు దేశాల క్వాడ్ కూటమి ‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ప్రారంభించింది. అరుదైన ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 20 బిలియన్ డాలర్ల (1.91 లక్షల కోట్లు) వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ ప్రాంతంలో సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని క్వాడ్ విదేశాంగ మంత్రులు తీర్మానించారు.
అలాగే ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, తోషిమిత్సు మొతేగి పాల్గొన్నారు. నాలుగు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.
‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ఖరారు చేశారు. సమావేశం అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దేశాలు తమ సొంత మార్గాలను నిర్ణయించుకోవడానికి, సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించే స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్‌కు మద్దతును పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి స్పష్టమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని, నిర్దిష్టమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు.
అక్కడ ఏకపక్ష చర్యలు వద్దు
హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచ వాణిజ్యం నిరాటంకంగా సాగాలని విదేశాంగ మంత్రులు స్పష్టంచేశారు. అక్కడ వాణిజ్య నౌకలపై ఇరాన్ సుంకాలు విధించడాన్ని తప్పుపట్టారు. అలాగే తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే, బలప్రయోగంతో అస్థిరపరిచే లేదా ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.
చైనా తీరుపై మండిపడ్డారు. సముద్ర వనరుల అభివృద్ధిలో జోక్యం చేసుకోవడం, నౌకాయానం, విమానయాన స్వేచ్ఛకు పదేపదే ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మానుకోవాలని చైనాకు తేల్చిచెప్పారు. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వాన్ని భగ్నం చేసే చర్యలు మానుకోవాలని చైనాను పరోక్షంగా హెచ్చరించారు.
చట్టాలను పాటించాల్సిందే: జైశంకర్
క్వాడ్ ఎజెండాలో భాగంగా కీలక, అరుదైన ఖనిజాల ఒప్పందం, ఇండో–పసిఫిక్ ఇంధన భద్రతా కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చర్చలు, ద్వైపాక్షిక సంప్రదింపుల్లో ఎక్కువ భాగం ప్రపంచ ప్రస్తుత పరిస్థితిపైనే జరిగాయని చెప్పారు. సహజంగానే, చర్చల ప్రధాన ఉద్దేశం ఇండో–పసిఫిక్‌కు సంబంధించిన అంశాలేనని అన్నారు.
సురక్షితమైన, నిరాటంకమైన సముద్ర వాణిజ్యంపై చర్చించామని, ఎవరైనా సరే అంతర్జాతీయ చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్‌కు అనేక కోణాలు, పార్శా్వలు ఉన్నాయని, వాటిలో సాధించిన పురోగతిని క్వాడ్ సమావేశం సమీక్షించిందని జైశంకర్ ఉద్ఘాటించారు. నాలుగు దేశాల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించాలని, సప్లై చైన్లను బలోపేతం చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.
సముద్ర భద్రతకు చర్యలు: రూబియో
ఇండో–పసిఫిక్ సముద్ర నిఘా సహకార కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్వాడ్ సమావేశం నిర్ణయించిందని మార్కో రూబియో తెలిపారు. ఇది ఇండో–పసిఫిక్‌లో మన నాలుగు దేశాల సముద్ర నిఘా సామర్థ్యాలను వినియోగించుకుంటుందని అన్నారు. క్వాడ్ దేశాల మధ్య ఇండో–పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవు మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి క్వాడ్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60 శాతం ఇండో–పసిఫిక్ గుండానే సాగుతోందని గుర్తుచేశారు. అందుకే సముద్ర భద్రతకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు: చైనా
బీజింగ్: క్వాడ్‌పై తన అక్కసును చైనా మరోసారి వెళ్లగక్కింది. కొన్నిదేశాలు కలిసి ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసుకోవడం, ఇతర దేశాలతో ఘర్షణలకు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంగళవారం పేర్కొంది. క్వాడ్ విషయంలో తమ వైఖరిని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. దేశాల మధ్య సహకారం ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడాలని అన్నారు. అంతేతప్ప మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. కూటముల పేరిట మరో దేశంతో ఘర్షణ పడొద్దని చెప్పారు.


