సీసీటీవీతో పాక్‌కు కీలక సమాచారం.. గుట్టురట్టు | Punjab Police Bust Spy Network, CCTV Footage Of Indian Army Bases Allegedly Sent To Pakistan Handler | Sakshi
Sakshi News home page

సీసీటీవీతో పాక్‌కు కీలక సమాచారం.. గుట్టురట్టు

May 22 2026 9:41 AM | Updated on May 22 2026 2:00 PM

Punjab Pathankot man installs cctv on highway arrest

చండీగఢ్: పంజాబ్‌ పోలీసులు పాకిస్థాన్‌ కుతంత్రాన్ని తిప్పికొట్టారు. పఠాన్‌కోటలో భారత సైన్యం, పారామిలటరీ దళాల సమాచారాన్ని సీసీటీవీ నిఘాచిత్రాల ద్వారా లాహార్‌కు చేరవేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.

పంజాబ్‌లోని చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి భారత సైన్యం, పారామిలిటరీ దళాల కదలికలపై నిఘా పెట్టేందుకు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారి-44లోని పఠాన్‌కోట్-జమ్మూ మార్గంలో ఒక వంతెన సమీపంలోని దుకాణంలో రహస్యంగా సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. దానిలోని నిఘా సమాచారాన్ని పాకిస్థాన్, విదేశాల్లోని ఆపరేటివ్‌లకు ఎలక్ట్రానిక్‌గా పంపినట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిందితుడు దీనిని ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇందుకు గానూ దుబాయ్‌లోని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి రూ. 40 వేల అందుకున్నాడని పేర్కొన్నారు.  

నిందితుడి వద్ద నుంచి  ఒక సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అతనితో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని వారందరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణ తేలిందన్నారు. ఈ నెట్‌వర్క్  సరిహద్దు సంబంధాలను గుర్తించడానికి  గూఢచర్యాన్ని గుర్తించడానికి విచారణ వేగవంతం చేశామని పోలీసులు పేర్కొన్నారు.

కాగా గత నెలలో పాకిస్థాన్ మద్దతు ఉన్న రెండు గూఢచార ముఠాలను పంజాబ్ పోలీసులు  ఛేదించారు. ఈ ముఠాలు, చైనాలో తయారైన అత్యాధునిక సౌరశక్తితో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి, కీలకమైన సైనిక స్థావరాల లైవ్ విజువల్స్‌ను  పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లకు ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. దేశ భద్రతకు ఎంతో కీలకమైన సమాచారం పాక్‌కు చేరడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement