మండే ఎండలతో జాగ్రత్త! | Prime Minister's Advice On Precautions To Be Taken During The Summer Heat | Sakshi
Sakshi News home page

మండే ఎండలతో జాగ్రత్త!

May 28 2026 9:26 AM | Updated on May 28 2026 9:26 AM

Prime Minister's Advice On Precautions To Be Taken During The Summer Heat

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పలు సూచనలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎండల తీవ్రత సమయంలో అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఆయన ఎక్స్‌ ద్వారా కోరారు. అనారోగ్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

‘దేశంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎండల కారణంగా సాధారణ జీవనంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. శరీరంలో నీటి లోపం రాకుండా తరచూ నీరు తాగుతూ హైడ్రేట్‌గా ఉండాలి.

మరిముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మానవత్వం, పరస్పర సహకారం ఎంతో అవసరం. దాహంతో ఉన్న వారికి సాధ్యమైనంత వరకు ఒక గ్లాసు మంచినీళ్లు అందించాలి’అంటూ విజ్ఞప్తి చేశారు. ‘ఆరు బయట పనులు చేసే వారు తీవ్రమైన వేడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి, ఎవరూ అలసట, నీరసం వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయరాదు.

ఏమాత్రం అలక్ష్యం చేసిన ప్రమాదకరంగా మారి చివరికి వడదెబ్బకు దారి తీయవచ్చు. కళ్లు తిరగడం, వికారం, తీవ్రమైన అలసట వంటి అధిక వేడి వల్ల కలిగే లక్షణాలను గమనిస్తూ ఉండండి. మీ చుట్టుపక్కల ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోయినా, బలహీనంగా అనిపించినా, తలనొప్పితో బాధపడుతున్నా వెంటనే వారిని చల్లని, నీడ ఉన్న ప్రదేశానికి తరలించడానికి సాయం పడటం ఉత్తమం. వారికి మంచి నీరు, ఓఆర్‌ఎస్‌ వంటివి ఇవ్వాలి. దాంతో, వారికి సాంత్వన చేకూరుతుంది. ఈ విషయంలో సకాలంలో స్పందించడం తప్పనిసరి’అని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement