ఆర్మీ ట్రెయినింగ్ కమాండ్‌కు రాష్ట్రపతి ముర్ము పిలుపు
సిమ్లా: భారత ఆర్మీ కార్యాచరణ సన్నద్ధతను మరింత మెరుగుపరిచేందుకు ఉత్సాహంతో కృషి కొనసాగించాలని ఆర్మీ ట్రెయినింగ్ కమాండ్(ఆర్‌ట్రాక్)కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఐదు రోజుల పర్యటనలో ఆఖరి రోజైన శుక్రవారం ఆర్‌ట్రాక్ ప్రధాన కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఆమెకు హిమాచల్ గవర్నర్ కవీందర్ గుప్తా, ఆర్‌ట్రాక్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర శర్మ ఆమెకు ఘన స్వాగతం పలికారు.
లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర శర్మ ప్రధానకార్యాలయంలోని వివిధ విభాగాలను ఆమెకు వివరించారు. అందులో పనిచేస్తున్న అన్ని విభాగాల సైనికులు, రక్షణ సిబ్బందిని వారు చేస్తున్న అద్భుతమైన కృషికి గాను ఆమె అభినందించారు. అలాగే, భవిష్యత్తులోనూ ఇదే విధమైన రెట్టింపు ఉత్సాహం, పట్టుదలతో కృషిని కొనసాగించాలని ఆమె వారిని కోరారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌ట్రాక్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను లెఫ్టినెంట్ జనరల్ శర్మ వివరించారు.
డ్రోన్ శిక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను, అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. అలాగే, సైన్యంలో ’రెడ్ టీమింగ్’ అనే భావనను ప్రవేశపెట్టడం, డిజిటైజేషన్, ఆటోమేషన్ దిశగా సాగుతున్న ప్రయత్నాలను వివరించారని రక్షణ శాఖ తెలిపింది. యుద్ధ వ్యూహాల రూపకల్పనతోపాటు సైన్యానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేయడంతో ఆర్‌ట్రాక్ కీలకంగా ఉందని రాష్ట్రపతి ప్రశంసించారు.
స్నేహపూర్వక దేశాలతో, ఇతర రక్షణ విభాగాలతో సమన్వయం సాధించడంలో వంటివాటిలోనూ ఎనలేని పాత్ర పోషిస్తోందని ఆమె కొనియాడారు. సైన్యంలో శిక్షణ, నాయకత్వ పటిమను పెంపొందించే అత్యున్నత సంస్థల్లో ఒకటైన సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించారని రాష్ట్రపతి భవన్ తెలిపింది. రాష్ట్రపతి ముర్ము స్థానికంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీకి పయనమయ్యారు. సిమ్లాలోని అన్నాడేల్ హెలిప్యాడ్ వద్ద గవర్నర్ కవీందర్ గుప్తా, సీఎం సుఖు ఇతర ఉన్నతాధికారులు ఆమెకు వీడ్కోలు పలికారు.


