
కేరళ పూజారిపై లైంగిక దాడి కేసు..
హనీ ట్రాప్ కింద ఫిర్యాదిదారు అరెస్టు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కేరళ పూజారిపై బెంగళూరు మహిళ లైంగికదాడి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మలుపు చోటుచేసుకుంది. చివరకు హనీట్రాప్‌గా మారి బాధిత మహిళే నిందితురాలు అయ్యింది. కేరళలోని త్రిస్సూరులోని ప్రసిద్ధ పెరింగొట్టుకర దేవాలయంలో ఓ పూజారిగా పని చేస్తున్న ఉన్ని దామోదరన్ పై బెంగళూరు బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఒక మహిళ అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఇది జరిగింది. తన భర్త చనిపోయి తాను కష్టాల్లో ఉండగా, పూజారిని కలిసి పరిష్కారం కోరానని, క్షుద్రపూజలు చేయిస్తానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. పోలీసులు త్రిస్సూరుకు వెళ్లి పూజారి దామోదరన్, ఆలయం ఉద్యోగి అరుణ్‌ని అరెస్టు చేశారు.
హోంమంత్రికి కుటుంబం ఫిర్యాదు...
పూజారి కుటుంబ సభ్యులు హోంమంత్రి పరమేశ్వర్‌ని కలిసి ఇదంతా కట్టుకథ అని, అకారణంగా అబద్దపు కేసు నమోదు చేశారని, హనీ ట్రాప్ కుట్ర అని ఫిర్యాదు చేయగా, విచారణ చేయాలని ఆయన పోలీసులకు ఆదేశించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మహిళ ఇచ్చింది అబద్ధపు ఫిర్యాదుగా పేర్కొన్నారు. పూజారిని అప్రతిష్టపాలు చేయడంతో పాటు కేసు వెనక్కు తీసుకోవాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.