దేశంలో ఇటీవల ‘పోక్సో’ చట్టం (POCSO Act 2012) గురించిన ప్రస్తావన తరచూ వినిపిస్తోంది. ఇందుకు కారణం బాలలపై అత్యాచారాలు పెరిగి పోవడమే. 2012 నవంబర్ నుండి అమలులోకి వచ్చిన ఈ ప్రత్యేక చట్టం పాత విచారణ పద్ధతిని పూర్తిగా మార్చి, పిల్లల మానసిక స్థితికి ప్రాధాన్యత ఇచ్చే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. పిల్లలకు ఉండే ప్రత్యేక మానసిక, శారీరక బలహీనతలను గుర్తించి, వారికి రక్షణ కల్పించడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం.
ఈ చట్టంలోని సెక్షన్ 29, 30ల ప్రకారం, నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్ కోర్టుముందు ఉంచినట్లయితే, నిందితుడే తప్పు చేశాడనే చట్టపరమైన ఊహను కోర్టు చేస్తుంది. దీనివల్ల నిందితుడే తాను నిర్దోషినని నిరూపించుకోవలసి ఉంటుంది. ఈ విధానం నేరస్థులు చట్టపరమైన లొసుగుల నుండి తప్పించుకోకుండా అడ్డుకట్ట వేసింది.
18 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ చట్టం కల్పించే రక్షణలు బలమైనవి, రాజీలేనివి. మొదటిది, ఈ చట్టం 18 సంవత్సరాల వయస్సును స్పష్టమైన పరిమితిగా నిర్ణయించింది. మైనర్ పిల్లలు లైంగిక చర్యకు సమ్మతి తెలపడానికి చట్టబద్ధంగా అర్హులు కాదనీ, అందువల్ల పిల్లల ఇష్టపూర్వకంగానే ఇది జరిగిందనే వాదనకు చట్టంలో తావులేదనీ స్పష్టం చేసింది. రెండవది, ఈ చట్టం బాలురకు, బాలికలకు సమానమైన రక్షణను కల్పిస్తూ పూర్తి లింగ సమతుల్యతను పాటించింది.
మూడవది, సెక్షన్ 19 ప్రకారం పిల్లలపై జరిగే వేధింపులను ఉపాధ్యాయులు, వైద్యులు లేదా పొరుగువారు ఎవరైనా గుర్తిస్తే వెంటనే అధికారులకు నివేదించడాన్ని తప్పనిసరి చేసింది. అలా సమాచారం ఇవ్వడంలో విఫలమైతే అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. చివరగా, విచారణ సమయంలో పిల్లలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. పోలీసు అధికారులు సాధారణ దుస్తులలోనే పిల్లలను విచారించాలి, కోర్టు విచారణలు రహస్యంగా (ఇన్–కెమెరా) జరగాలి. పిల్లలు నిందితుడిని నేరుగా ఎదుర్కొనే అవసరం లేకుండా సాక్ష్యం చెప్పేలా ఏర్పాట్లు చేయాలి.
ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్ తీసుకొని ప్రియుడితో పరార్
మార్పులు, సవరణలు పార్లమెంటు ఈ చట్టానికి కాలక్రమేణా కీలకమైన సవరణలను చేసింది. 2019 సవరణ ద్వారా తీవ్రమైన లైంగిక దాడులకు పాల్పడే వారికి మరణశిక్షను విధించే నిబంధనను తెచ్చారు. కనీస జైలుశిక్షను 7 ఏళ్ల నుండి 10 ఏళ్లకు పెంచారు. డిజిటల్ మాధ్య మాలలో పిల్లల లైంగిక చిత్రాలను ఉంచడం లేదా నిల్వ చేయడాన్ని నేరంగా పరిగణించారు. జూలై 2024లో భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చిన తర్వాత, ఈ చట్టాన్ని డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించే డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులు, డిజిటల్ దోపిడీల నుండి పిల్లలను రక్షించేలా మరిన్ని కఠినమైన నిబంధన లను చేర్చారు. ఈ చట్టపరమైన మార్పులకు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు మరింత బలాన్ని చేకూర్చాయి.
చారిత్రాత్మక ‘ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్‌ఆఫ్ ఇండియా (2017)’ కేసులో, 15 నుండి 17 సంవత్సరాల మధ్య ఉన్న మైనర్ భార్యలతో భర్తలు జరిపే లైంగిక చర్యలను అత్యాచారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదేవిధంగా, 2021 నాటి ‘అటార్నీ జనరల్ వర్సెస్ సతీష్’ కేసులో (ద స్కిన్ టు స్కిన్ కేసు), బట్టలపై నుండి తాకడం వల్ల అది లైంగిక దాడి కిందకు రాదన్న బొంబాయి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చట్టంలో ముఖ్యంగా కావలసింది నేరస్థుడి ‘లెంగిక ఉద్దేశ్యం’ మాత్రమేననీ, దుస్తులు అనేవి నేరస్థుడికి రక్షణ కవచాలుగా మారకూడదనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
– ఎస్. అక్బర్, ఎస్.ఎఫ్.ఐ. తిరుపతి జిల్లా కార్యదర్శి
ఇదీ చదవండి : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?


