
ప్రజాసేవే పరమావధిగా పని చేస్తున్నాం
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట
ప్రధానమంత్రి మోదీ స్పషీ్టకరణ
ఢిల్లీలో కర్తవ్య భవన్–03 ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రజాసేవే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో గత 11 ఏళ్లుగా పారదర్శక, స్పందించే, పౌరులే కేంద్రంగా ఉన్న పరిపాలనా విధానం కొనసాగుతోందని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందుకోసం స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీలో కర్తవ్య భవన్–03ని ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టుతోపాటు మరిన్ని ఇతర మౌలిక సదుపాయాలు భారతదేశ గ్లోబల్ విజన్‌కు ప్రతీక అని ఉద్ఘాటించారు. బ్రిటిష్ కాలం నాటి భవనాల్లో ప్రభుత్వ యంత్రాంగం దశాబ్దాలుగా పని చేస్తోందని, అవి చాలావరకు కాలం చెల్లిపోయాయని అన్నారు. ఆయా భవనాల్లో సరైన వసతులు, గాలి, వెలుతురు కూడా లేవని చెప్పారు. అందుకే నేటి అవసరాలకు అనుగుణంగా అందుకే కర్తవ్య భవనాలు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. మొత్తం 10 భవనాలు నిర్మిస్తున్నామని, వీటితో ప్రభుత్వానికి ప్రతిఏటా రూ.1,500 కోట్లు ఆదా అవుతాయని స్పష్టంచేశారు.
విజయ గాథలు లిఖించాలి
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విజయ గాథలను లిఖించడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అదే మనందరి సంకల్పం కావాలన్నారు. మన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించాలని, దేశంలో ఉత్పాదకత పెంచాలని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సంకల్పానికి గుర్తు కర్తవ్య భవన్ అని వ్యాఖ్యానించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కు ఇది దశ దిశను నిర్దేశిస్తుందని ఉద్ఘాటించారు.
మన దేశం స్వాతంత్య్రం సాధించుకున్న ప్రపంచవ్యాప్తంగా సమయంలోనే చాలా దేశాలు స్వాతంత్య్రం పొందాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆయా దేశాల తరహాలో మన దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదో ఆత్మసమీక్ష చేసుకోవాలని సూచించారు. ఇప్పటి సమస్యలను ఇప్పుడే పరిష్కరించుకోవడం మన బాధ్యత అని చెప్పారు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించకూడదని స్పష్టంచేశారు.
అత్యాధునిక వసతులతో కర్తవ్య భవన్–03
దేశ రాజధానిలో కర్తవ్య భవన్–03 అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న లక్ష్యంతో సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 10 ఉమ్మడి కేంద్ర సచివాలయ(సీసీఎస్) భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్మాణం పూర్తయిన తొలి భవనాన్ని మోదీ లాంఛనంగా ప్రారంభించారు.
కర్తవ్య భవన్–03లో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎంఎస్‌ఎంఈ, పెట్రోలియం–సహాజవాయువు శాఖలు కొలువుదీరబోతున్నాయి. ముఖ్య శాస్త్రీయ సలహాదారు కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు బ్రిటిష్ కాలంతోపాటు 1950వ దశకంలో, 1970వ దశకంలో నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్‌లో పని చేస్తున్నాయి. ఆయా భవనాలు చాలావరకు బలహీన పడడంతో నూతన భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కర్తవ్య భవన్–03ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ భవనమంతా కలియదిరిగారు. ఉద్యోగులతో మాట్లాడారు. ఈ భవనంలో యోగా రూమ్, మెడికల్ రూమ్ సహా అత్యాధునిక వసతులున్నాయి.
కర్తవ్య భవన్–01, కర్తవ్య భవన్–02 నిర్మాణం వచ్చే నెలలో పూర్తికానుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని, వైస్ ప్రెసిడెంట్ కాంక్లేవ్‌ను నిర్మించిన సంగతి తెలిసందే. అలాగే విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ దాకా కర్తవ్య పథ్‌ను అభివృద్ధి చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కాంక్లేవ్, కేబినెట్ సెక్రెటేరియట్, ఇండియా హౌస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్ నిర్మించబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ కాంక్లేవ్‌లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. మొదటి మూడు కర్తవ్య భవన్‌ల భద్రతకు కేంద్ర ప్రభుత్వం 735 మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్లను కేటాయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.