ఐదింటిలో మేమే గెలుస్తాం! | PM Narendra Modi Confident Of BJP Historic Hat-Trick In 5 State Polls | Sakshi
Sakshi News home page

ఐదింటిలో మేమే గెలుస్తాం!

Apr 30 2026 4:52 AM | Updated on Apr 30 2026 4:52 AM

PM Narendra Modi Confident Of BJP Historic Hat-Trick In 5 State Polls

ఎన్నికల ఫలితాలతో వికసిత్‌ భారత్‌ సంకల్పం బలోపేతం  

దేశ పురోగతి వేగానికి ఈ ఫలితాలు నూతన శక్తిని ఇస్తాయి  

ప్రధాని నరేంద్ర మోదీ ధీమా  

వారణాసి/లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. వచ్చే నెల 4న వెలువడే ఫలితాలు వికసిత్‌ భారత్‌ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని, దేశ పురోగతి వేగానికి నూతన శక్తిని ఇస్తాయని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం తథ్యమని స్పష్టంచేశారు. 

ప్రధాని బుధవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి హర్డోయిలో జరిగిన సభలో ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు ఈసారి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని, గత ఏడు దశాబ్దాల్లో ఇది కనీసం కలలో కూడా ఊహించని పరిణామం అని చెప్పారు. ప్రజాస్వామ్య వేడుకలో నేడు ఒక ముఖ్యమైన రోజు అని ఉద్ఘాటించారు.  

పశ్చిమ బెంగాల్‌ ప్రజలకు కృతజ్ఞతలు  
బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌లో జరిగినట్లుగానే రెండో దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ జరుగుతోందని మోదీ తెలిపారు. పోలింగ్‌ బూత్‌ల ముందు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయని చెప్పారు. తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలనే ప్రజల ఉత్సాహాన్ని ఈ ఓటింగ్‌ ప్రతిబింబిస్తోందని స్పష్టంచేశారు. 

బెంగాల్‌లో ఈసారి భయానికి తావులేని వాతావరణంలో ప్రజలు ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇది దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక శక్తివంతమైన చిహ్నమని వ్యాఖ్యానించారు. హక్కుల పట్ల అవగాహన కలిగి, పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్న పశ్చిమ బెంగాల్‌ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే చరిత్రాత్మక, నిర్ణయాత్మక విజయం సాధించిందని మోదీ గుర్తుచేశారు. 

తాజాగా గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అద్భుత విజయం సొంతం చేసుకుందని తెలిపారు. దాదాపు 85 శాతం మున్సిపాల్టీలు, పంచాయతీలు బీజేపీకే దక్కాయన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అఖండ విజయం తథ్యమని పునరుద్ఘాటించారు. విపక్ష సమాజ్‌వాదీ పార్టీపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలకు ఆ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రజలను దూషించే డీఎంకే వంటి పార్టీలతో చేతులు కలిపిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ ఓటు వేసిందని ఆక్షేపించారు.  

గంగా ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం  
ఉత్తరప్రదేశ్‌లో 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రదాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఆ ఆరు వరుసల అత్యాధునిక రహదారి మీరట్, ప్రయాగ్‌రాజ్‌లను అనుసంధానిస్తుంది. ఈ హైస్పీడ్‌ కారిడార్‌ ఉత్తరప్రదేశ్‌ అంతటా అనుసంధానాన్ని గణనీయంగా పెంచుతుందని, పారిశ్రామిక పెట్టుబడులు, లాజిస్టిక్స్, వ్యవసాయ మార్కెటింగ్, ప్రాంతీయ సమతుల్యతకు ఊతం ఇస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్య(పీపీపీ) మోడల్‌ కింద గంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ఇందులో 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్‌ కూడా ఉంది. వాయుసేన విమానాలు అత్యవసర సమయాల్లో దిగేందుకు దీనిని నిర్మించారు.

వారణాసిలో మోదీ రోడ్‌ షో  
ప్రధాని మోదీ బుధవారం ఉదయం తన సొంత నియోజకవర్గం వారణాసిలో భారీ రోడ్‌ షోలో పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు స్వాగతం పలికారు. అలాగే కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాలు పఠించారు. మోదీకి స్థానిక నాయకులు త్రిశూలం, ఢమరుకం, సంప్రదాయ కండువా బహూకరించారు. బాబా విశ్వనాథ్‌ ఆలయంలో పూజలు చేయడం, శివ లింగాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. దేశ పౌరుల సుఖ సంతోషాల కోసం విశ్వనాథుడిని ప్రార్థించానని తెలిపారు. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ వద్ద చిన్నారులతో మోదీ సంభాషించారు.   

Advertisement
 
Advertisement
Advertisement