మహిళా రిజర్వేషన్లపై ప్రధాని
2029 నుంచే చట్టసభల్లో అమలు
ఈ శతాబ్దికే అతి ముఖ్య నిర్ణయం
నారీ శక్తి వందన్ సదస్సులో మోదీ
న్యూఢిల్లీ: చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కోసం మహిళల దశాబ్దాల ఎదురుచూపులకు అతి త్వరలో తెర పడనుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేలా నారీ శక్తి వందన్ అధినియమ్‌కు రాజ్యాంగ సవరణ చేపట్టనున్నట్టు గుర్తు చేశారు. ఇందుకోసం గురువారం నుంచి పార్లమెంటు మూడు రోజుల పాటు సమావేశం కానుండటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన ‘నారీ శక్తి వందన్’సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల రూపంలో ఈ శతాబ్దిలోకెల్లా అతి ముఖ్యమైన నిర్ణయాన్ని భారత్ అతి త్వరలో తీసుకోబోతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దాన్ని నారీ శక్తికే అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మహిళా రిజర్వేషన్ల చట్టానికి రాజ్యాంగ సవరణ ద్వారా మన పార్లమెంటు కొత్త చరిత్ర సృష్టించనుంది.
మనందరి జీవితకాలంలో దేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన నిర్ణయంగా ఇది మిగిలిపోనుంది. మహిళా సాధికారతకు నిదర్శనంగా, వారి శక్తియుక్తులకు నిజమైన నివాళిగా నిలవనుంది. భారత్‌లో స్త్రీ పురుష సమతావాదం, సామాజిక న్యాయం కేవలం నినాదాలు కావని, రోజువారీ పని సంస్కృతి మొదలుకునిఅత్యున్నత నిర్ణయ ప్రక్రియ దాకా అన్నింట్లోనూ అవి విడదీయలేని భాగమని నిరూపించనుంది. భారత మహిళలు ఇప్పటికే పాలనలో అన్ని స్థాయిల్లోనూ నిర్ణాయక పాత్ర పోషిస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు.
మున్ముందు మరిన్ని పెద్ద బాధ్యతలను సమర్థంగా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు’’అంటూ కొనియాడారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2027 జనగణనతో ముడిపడి ఉన్నాయి. దాంతో ప్రస్తుత చట్టం ప్రకారం వాటిని 2034 నుంచి మాత్రమే అమలు చేయడం వీలు పడుతుంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యను 816కు పెంచనున్న నేపథ్యంలో 273 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి.
అత్యున్నత పదవుల్లో ‘ఆమె’
స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని రాజ్యాంగ పరిషత్తు దాకా మహిళలు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారని మోదీ గుర్తు చేశారు. స్వతంత్ర భారతానికి పునాదిరాయి వేయడంలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. ‘‘దేశ నిర్మాణంలో కీలకమైన పాత్రలు పోషించే అవకాశం దొరికిన ప్రతిసారీ అద్భుత పనితీరుతో భారత మహిళలు నిత్యం తమను తాము నిరూపించుకుంటూనే ఉన్నారు.
ఇప్పుడు రాష్ట్రపతి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి దాకా అత్యున్నత బాధ్యతలను అద్భుతంగా నెరవేరుస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం చురుగ్గా ఉన్నచోట మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా మహిళలు స్థానిక పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పంచాయతీల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరింది. ఈ ఘనతను చూసి ప్రపంచమే విస్తుపోతోంది’’అంటూ ప్రధాని హర్షం వెలిబుచ్చారు.
అన్ని పార్టీలదీ అదే ఆకాంక్ష
మహిళా రిజర్వేషన్ల బిల్లును 2023లో పార్లమెంటులో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించాయని, 2029లోపే దాన్ని అమలు చేయాలని ఆకాంక్షించాయని మోదీ గుర్తు చేశారు. చర్చలు, పరస్పర సహకారం ద్వారా దీన్ని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘దీనిపై దేశవ్యాప్తంగా మహిళల్లో పట్టరాని ఉత్సాహం కనిపిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో పెద్ద సంఖ్యలో కాలు పెట్టేందుకు వారు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఆ కలలకు ఇప్పుడిక రెక్కలు రానున్నాయి’’అని అభిప్రాయపడ్డారు.
గృహస్తును కాకపోయినా సాదకబాధకాలు తెలుసు!
మహిళల ఆర్థిక సాధికారత వల్ల కుటుంబాల్లో వారికి గౌరవాదరాలు పెరిగాయని మోదీ అభిప్రాయపడ్డారు. తాను గృహస్తును కాకపోయినా ఇంటిని నడపడంలోని సాదకబాధకాలు బాగా తెలుసని ఆయన చెప్పడంతో సమావేశంలో పాల్గొన్న మహిళలంతా పెద్దపెట్టున చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు! ‘‘ఇల్లు మొదలుకుని వాహనం దాకా కుటుంబ ఆస్తులన్నీ గతంలో ప్రధానంగా పురుషుల పేర్లతోనే ఉండేవి. పీఎం ఆవాస్ యోజన తదితరాలతో పరిస్థితి మారింది.
ఆస్తులకు మహిళలు యజమానులవుతున్నారు. గత 11 ఏళ్లలో 3 కోట్ల మందికి పైగా మహిళలు ఇంటి యజమానులయ్యారు’’అని ప్రధాని అన్నారు. ‘‘గతంలో ఇళ్లలో తండ్రీ కొడుకులు వ్యాపారం గురించి చర్చించుకుంటుంటే మహిళలు వారికి చాయ్ బిస్కట్లు ఇచ్చేందుకే పరిమితమయ్యేవారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడంతో ఇప్పుడు పరిస్థితులు మారాయి. వ్యాపార నిర్ణయాలకు సంబంధించి అమ్మతో కూడా చర్చిద్దామని కొడుకులు తండ్రులతో అంటున్నారు’’అని చెప్పుకొచ్చారు.


