
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తన వందేళ్ల ఘన చరిత్రతో ఎన్నో మైలు రాళ్లను చూసిందని, ఆర్‌ఎస్‌ఎస్ అంటే విజయం అని, నేషన్ ఫస్ట్ అనేది సంఘ్ విధానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో బుధవారం జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. దేశానికి ఆర్‌ఎస్‌ఎస్ అందించిన సేవలకు గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో భారతమాత చిత్రాన్ని నాణెంపై రూపొందించడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ నాణెంపై ఆర్‌ఎస్‌ఎస్ నినాదం రాష్ట్రే స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’ అని ఉందని, దీని అర్థం ప్రతిదీ దేశానికి అంకితం.. ప్రతిదీ దేశానికే.. ఏదీ నాది కాదని ప్రధాని వివరించారు. రేపు విజయదశమి, చెడుపై మంచి సాధించిన విజయం. అన్యాయంపై న్యాయానికి దక్కిన విజయం. అబద్ధాలపై సత్యం సాధించిన విజయం. చీకటిపై వెలుగు సాధించిన విజయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
राष्ट्रीय स्वयंसेवक संघ की 100 वर्षों की गौरवशाली यात्रा त्याग, निःस्वार्थ सेवा, राष्ट्र निर्माण और अनुशासन की अद्भुत मिसाल है। RSS के शताब्दी समारोह का हिस्सा बनकर अत्यंत गौरवान्वित अनुभव कर रहा हूं।
https://t.co/S4gxc0X3IE— Narendra Modi (@narendramodi) October 1, 2025
వందేళ్ల క్రితం దసరా నాడు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన అనేది వేల ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ పునరుత్థానమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలను చూసే అదృష్టం మనకు దక్కిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న పలు సంస్థలు సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను తీరుస్తున్నాయని ప్రధాని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో విభిన్న విభాగాలు ఉన్నప్పటికీ అవి ఎప్పుడూ ఘర్షణ పడలేదని, ఎందుకంటే సంస్థ లక్ష్యం కోసం అవన్నీ పనిచేస్తున్నాయని, ‘దేశం మొదట’ అనే దిశగా ఆర్‌ఎస్‌ఎస్ ముందుకు నడుస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్థానం
1925లో నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. పౌరులలో సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థగా ఇది ప్రారంభమైంది. గత వందేళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సామాజిక-సాంస్కృతిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. వరదలు, భూకంపాలు, తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం అందించడంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు.