
తెగల మధ్య ఘర్షణలు.. తదనంతరం చెలరేగిన హింసతో చీకట్లో ఉండిపోయిన మణిపూర్‌ని ఇప్పుడు శాంతి-అభివృద్ధి అనే కొత్త ఉదయం తడుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో శనివారం ఆయన పర్యటించారు. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థానం చేసిన అనంతరం.. చురాచంద్‌పూర్ పీస్ గ్రౌండ్ వేదికగా మోదీ ప్రసంగించారు.
మణిపూర్ ఆశల భూమి. గతంలో హింస అనే చీకటి ఈ అందమైన ప్రాంతాన్ని కమ్మేసింది. కానీ ఇప్పుడు నమ్మకం, శాంతి, అభివృద్ధి అనే కొత్త వేకువ రాబోతోంది. హింసతో ఎవరికీ లాభం ఉండదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం శాంతిని ఎంచుకోండి. శాంతి ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించండి..
..ఇవాళ ఇంఫాల్‌లో కొత్త విమానాశ్రయం, జిరిబాం-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు, మహిళా హాస్టళ్లు, ఐటీ పార్కులు వంటి వేల కోట్ల రూపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. మణిపూర్‌లో 60,000 పక్కా ఇళ్లు నిర్మించాం. 3.5 లక్షల ఇళ్లకు త్రాగునీటి సరఫరా అందిస్తున్నాం. మణిపూర్ అంతటా పక్కా ఇళ్లు నిర్మించాలన్నది మా అభిమతం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మణిపూర్ ప్రజలతోనే ఉంటుంది.
గతంలో ఢిల్లీ నుంచి నిర్ణయాలు మణిపూర్‌కు రావడానికి నెలలు, సంవత్సరాలు పట్టేవి. ఓటు బ్యాంకు రాజకీయాలు ఈశాన్య భారతాన్ని ఇబ్బంది పెట్టాయి. కానీ గత 11 ఏళ్లుగా.. ఇక్కడి ఎన్నో సంక్షోభాలు పరిష్కారానికి నొచుకున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంతో నిర్ణయాలు అమలు కావడానికి ఎంతో సమయం పట్టదు. మీరు కలలు కనండి. మేము వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోంది. అభివృద్ధిలో మణిపూర్ దేశంతో పాటు ముందుకు సాగుతుంది’’ అని అన్నారాయన.
మోదీ ఇవాళ రూ.8,500 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు మణిపూర్‌లో శంకుస్థాపన చేశారు. ఇంఫాల్‌కు కొత్త ఎయిర్‌పోర్ట్, కొత్త హైవేలు, రైలు-రోడ్డు మార్గం అనుసంధానం, జిరిబమ్ ఇంఫాల్ మధ్య రైల్వే ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి.ఈ కార్యక్రమం కంటే ముందు.. చురాచంద్‌పూర్‌లో హింసాత్మక ఘటనల కారణంగా నిరాశ్రయులైన వారిని కలిసి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ సమయంలో వాళ్లకు ఆయన ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్లు, హక్కుల విషయంలో మైతేయి, కుకీ తెగల మధ్య 2023 మే నెలలో ఘర్షణలు మొదలై.. ఆ అల్లర్లలో హింస ప్రజ్వరిల్లింది. ఆ ఘర్షణల్లో 250 మంది దాకా మరణించారు. వేలాది మంది(60 వేల మందికిపైనే) నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల కారణంగా.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంతో.. వేల మంది ఇంకా తమ ఇళ్లకు చేరకుండా క్యాంపుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బీరెన్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. గతంలో.. మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత 2018లో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను తొలిసారి సందర్శించారు. ఆ సమయంలో ఇంఫాల్ నగరంలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, 2022లో కూడా ఆయన మణిపూర్‌కు వర్చువల్ రూపంలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం కోసం ప్రసంగించారు. హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇవాళే తొలిసారి(29 నెలల తర్వాత). 2023 జూలై 20న, హింసపై తొలిసారి పార్లమెంటులో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెట్టాయి. మోదీ పర్యటన.. మణిపూర్ ప్రజలను అవమానించడమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన పెద్ద విషయమేమీ కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ చాలా కాలంగా సమస్యల్లో ఉంది. ఇప్పుడు ప్రధాని అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది పెద్ద విషయం కాదు. ప్రస్తుతం దేశంలో అసలు సమస్య 'ఓటు దొంగతనం' (Vote Chori) అని పేర్కొన్నారాయన.
ఇక.. మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదంటూ మోదీ మణిపుర్ పర్యటనపై ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ‘‘రెండేళ్ల తర్వాత బాధితులను పరామర్శించడానికి వెళ్లడం బాధాకరం. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడకు వెళ్లే వాళ్లు. స్వాతంత్ర్యం నుంచి అందరూ ప్రధానులు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రధాని మోదీ మాత్రం రెండేళ్లు ఆలస్యంగా దాన్ని పాటిస్తున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు.