మనపైనా యుద్ధ ప్రభావం
అందుబాటులో ఉన్న వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరిస్తున్నాం
కొత్తగా ఏడు సాధికార బృందాలను ఏర్పాటు చేశాం
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రకటన
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యుద్ధ ప్రభావం మనపైనా ఉందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో ఎరువుల సరఫరాకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంచేశారు.
ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇంధన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు కాచుకొని ఉంటాయని చెప్పారు. అందుకే నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇంధనం, వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి, అవసరమైన పరిష్కార మార్గాలు రూపొందించడానికి ఇప్పటికే మంత్రులతో ఒకబృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతోందని అన్నారు.
ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలి
కోవిడ్–19 మహమ్మారి సమయంలో వేర్వేరు రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి నిపుణులు, అధికారులతో కూడిన సాధికార బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే.. సోమవారం కొత్తగా ఏడు బృందాలను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సప్లై చైన్స్, పెట్రోలియం, డీజిల్, ఎరువులు, సహజ వాయువు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాల ఆధారంగా చర్యలు తీసుకునే బాధ్యతను ఈ బృందాలకు అప్పగించినట్లు చెప్పారు. సమిష్టి కృషి ద్వారా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించగలమన్న విశ్వాసం పూర్తిగా ఉందని వ్యాఖ్యానించారు.
దక్షిణాసియా యుద్ధం వల్ల మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి, యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన వ్యూహాలపై సాధికార బృందాలు కసరత్తు చేస్తాయన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఒక ప్రత్యేకమైన స్వభావం కలదని, దానికి తగినట్టుగానే విభిన్నమైన రీతిలో పరిష్కారాలను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రతి సవాలును మనం ఓర్పు, సంయమనం, ప్రశాంతమైన మనసుతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు నిరంతరం మారుతున్నాయని, అందుకే ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. పశ్చిమాసియా ప్రతికూల పరిణామాల ప్రభావం ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.
శాంతి యత్నాలకు భారత్ మద్దతు
ఎరువుల సరఫరా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. రాబోయే పంటల సీజన్‌లో సరిపడా ఎరువులు అందజేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. సంక్షోభంతో సంబంధం లేకుండా అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం మన బాధ్యత అని వివరించారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను కోరుకుంటున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. దక్షిణాసియా లో శాంతి యత్నాలకు భారత్ మద్దతు కచి్చతంగా ఉంటుందన్నారు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గిపోయి, హర్మూజ్ జలసంధి తేరుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఒకవేళ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.


