
బెంగళూరు: భారత్ ‘డెడ్ ఎకానమీ’ అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ప్రపంచంలో భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదంటూ స్పష్టం చేశారు. ఈరోజు( ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) బెంగళూరులో మెట్రో ఫేజ్-3 కి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన మోదీ ప్రసంగించారు. భారత్ మూడో ఆర్థిక శక్తి కాబోతుందంటూ ఆయన స్పష్టం చేశారు. రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అనేవి భారత్ ఆర్థికంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
‘గత 11 ఏళ్లలో భారత ఆర్థికంగా బలోపేతమైంది. 10వ స్థానం నుంచి 5 స్థానానికి వచ్చాం. ఇప్పుడు మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే ట్రాక్‌లో ఉన్నాం. కచ్చితమైన, నిజాయితీ పరమైన దృష్టి పెట్టడంతోనే ఇది సాధ్యమవుతూ వస్తుంది. అందుకే ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదగడానికి మనం దగ్గర్లోనే ఉన్నాం,’ అని తెలిపారు.
2014 నాటికి మన దేశంలో ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు అందుబాటులో ఉండేది. ఇప్పుడు 24 నగరాల్లో ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్. 2014 నాటికి ఆల్ ఇండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లు అనేవి ఏడు, మెడికల్ కాలేజీలు 387 ఉండేవి. ఇప్పుడు మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లు 22, మెడికల్ కాలేజీలు 704 ఉన్నాయి. ఎలక్రికల్ రైళ్లు 2014 నాటికి 20వేలు మాత్రమే ఉంటే నేటికి అవి 40వేలు అయ్యాయి. ఇక ఎయిర్‌పోర్ట్‌లు 74 నుంచి 180కు పెరిగాయి’ అని ప్రభుత్వం సాధించిన ఘనతలను చెప్పుకొచ్చారు మోదీ.