
ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణన
హింసపై రాజ్యాంగ విజయానికి ప్రతీక
పార్లమెంటు ఆవరణలో ప్రధాని వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు సిద్ధమంటూ సంకేతం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జాతికి విజయోత్సవాలుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘బాంబులు, తుపాకులు అవి పుట్టించే హింసపై ఎప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిదే పై చేయి. మా పాలనలో పదేపదే నిరూపితమవుతూ వస్తున్న వాస్తవమిది’’ అని మోదీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌తో సహా విపక్షాలు లేవనెత్తదలచిన అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు.
‘‘ఇవి దేశానికి గర్వకారణంగా నిలవనున్న సమావేశాలు. విజయో త్సవాల వంటివి. మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించింది. సైన్యం 100 శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను సాధించి భారత పతాకను సమున్నతంగా ఎగురవేసింది’’ అని ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘‘ఆ ఘనతను అఖిలపక్ష బృందాలు దేశదేశాల్లో చాటాయి. ఆ పార్టీలకు, ఎంపీలకు నా అభినందనలు’’అన్నారు. సిందూర్ వేళ మేడిన్ ఇండియా ఆయుధాలు అద్భుతంగా సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని గుర్తు చేశారు.

May the Monsoon Session of Parliament be productive and filled with enriching discussions that strengthen our democracy. https://t.co/Sj33JPUyHr
— Narendra Modi (@narendramodi) July 21, 2025
‘‘పహల్గాం ఉగ్ర దాడి ప్రపంచాన్నే షాక్‌కు గురి చేసింది. ఉగ్రవాదంపై పోరులో దేశాలన్నీ మరోసారి ఒక్కతాటిపైకి వచ్చేలా చేసింది. అంతేకాదు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూడా మన పతాక ఇటీవలే సగర్వంగా ఎగిరింది. దేశంలో నక్సలిజం ఆనవాలు లేకుండా పోతోంది. నక్సల్ హింసతో రెడ్ జోన్‌గా మారిన అనేకానేక ప్రాంతాలు కాస్తా అభివృద్ధికి నోచుకుని హరితవర్ణం పులుముకుంటున్నాయి. కొద్దిరోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో దేశ ఆర్థికానికి ఎనలేని ఊపు లభిస్తోంది. డ్యామ్‌లు మూడింతల జలకళతో పరవళ్లు తొక్కుతున్నాయి. గత పాలకుల హయాంలో రెండంకెల్లో కొనసాగిన ద్రవ్యోల్బణం మా పాలనలో దశాబ్దకాలంగా నేలకు దిగుతోంది. వృద్ధి చుక్కలు తాకుతోంది’’అంటూ తమ సర్కారు సాధించిన ప్రగతిని వివరించారు. ‘‘పార్టీలుగా ఎవరి అజెండా వారికి ఉండొచ్చు. కానీ ఆ విభేదాలకు అతీతంగా ఎంపీలంతా సభల్లో ఒకే గళం వినిపించడం ద్వారా పార్లమెంటు సమావేశాల స్ఫూర్తిని సాకారం చేస్తారని ఆశిస్తున్నా’’ అని విపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు.