రాజకీయాల్లో వారసత్వం సాధారణమే.. అయితే ఈ జాబితాలోని వారు సొంతంగా తమదైన ముద్రను దక్కించుకోవడం అనేది అంత ఈజీగా జరగదు. అయితే పశ్చిమ బెంగాల్‌లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని వాడవాడలా అభిషేక్ బెనర్జీ పేరు మారుమోగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లునిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ, కేవలం ఆ గుర్తింపునకే పరిమితం కాకుండా, పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు అభిషేక్ బెనర్జీ. మేనత్త నీడ నుంచి బయటపడి, బీజేపీకి దీటైన సవాల్ విసురుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సేనాధిపతిగా మారిన అభిషేక్ ప్రయాణం అత్యంత ఆసక్తికరం.
నెత్తురోడిన అత్తను చూసిన రెండేళ్ల చిన్నారి
అది 1990వ సంవత్సరం. సీపీఎం కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి, తలకు కట్టుతో మంచంపై ఉన్న మమతా బెనర్జీని చూసి ఆ రెండేళ్ల బాలుడు చలించిపోయాడు. తన అత్తపై ఎందుకు దాడి జరిగిందని ఇంట్లో నినాదాలు చేస్తూ, అప్పటి నుంచే రాజకీయ పరిణతిని కనబరిచాడు. దశాబ్దాల తర్వాత అదే ఫోటోను ఓ సభలో మమత స్వయంగా అతనికి బహుకరించారు. ఆనాటి ఆ చిన్నారే నేటి తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ అభిషేక్ బెనర్జీ.
23 ఏళ్లకే యూత్ ఐకాన్‌గా ఎంట్రీ
పశ్చిమ బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్షాల కోటను బద్దలు కొట్టి, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2011 సంవత్సరంలోనే అభిషేక్ రాజకీయ అరంగేట్రం జరిగింది. కేవలం 23 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. పాత తరం నేతల భావోద్వేగ, పోరాట పద్ధతులకు భిన్నంగా.. అట్టడుగు స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.
రికార్డు మెజారిటీలతో తిరుగులేని సత్తా
2014లో లోక్‌సభ బరిలోకి దిగిన అభిషేక్, తన 26వ ఏట డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి గెలిచి, 16వ లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. ఆ ఎన్నికల్లో 71,000 ఓట్ల మెజారిటీ సాధించిన ఆయన, ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 2019లో బీజేపీ హవాలోనూ తన మెజారిటీని 3.2 లక్షలకు పెంచుకున్నారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు.
పార్టీ పగ్గాలు.. ఈడీ, సీబీఐ సవాళ్లు
అంచెలంచెలుగా ఎదిగిన అభిషేక్ ప్రభావం 2021 నాటికి పార్టీలో పూర్తిగా స్థిరపడింది. ఆయన తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బెంగాల్‌లో దూసుకువస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో, పార్టీ జాతీయ ఆశయాలకు ప్రధాన ముఖచిత్రంగా మారారు. అయితే దశాబ్ద కాలంపైగా సాగిన ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. బొగ్గు కుంభకోణం, ఉపాధ్యాయ నియామకాల స్కామ్ వంటి అవినీతి ఆరోపణలతో ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ) విచారణలను సైతం ధైర్యంగా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఓల్డ్ వర్సెస్ న్యూ.. సరికొత్త వ్యూహం
గత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్‌లో సీనియర్లకు, అభిషేక్ నేతృత్వంలోని యువ నాయకత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందనే వార్తలు వచ్చాయి. కానీ, 2026 ఎన్నికల్లో ఈ విభేదాలన్నీ సమసిపోయినట్లు కనిపించింది. ఇప్పుడు పార్టీలో పక్కా వ్యూహం అమలవుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా కేంద్రంగా పరిపాలనను పర్యవేక్షిస్తూ, ఉత్తర బెంగాల్‌పై దృష్టి పెడితే.. అభిషేక్ గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి దక్షిణ బెంగాల్‌లో పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు.
2026 ఎన్నికలు.. అసలైన అగ్నిపరీక్ష
అభిషేక్ బెనర్జీకి 2026 ఎన్నికలు అత్యంత కీలకం. ఇవి పార్టీలో తన స్థానాన్ని, నాయకత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎదురైన అగ్నిపరీక్షలాంటివి. డేటా ఆధారిత, యువతను ఆకర్షించే సరికొత్త వ్యూహాలతో, కచ్చితమైన బూత్ స్థాయి మేనేజ్‌మెంట్‌తో ఆయన ముందుకు వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్‌ను కేవలం ఒక ప్రాంతీయ పార్టీగానే కాకుండా, బీజేపీ సంస్థాగత బలాన్ని దీటుగా ఢీకొట్టగల శక్తిగా మలచే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలు అభిషేక్ బెనర్జీకి తనను తాను అత్యున్నత నేతగా నిరూపించుకునేందుకు దక్కిన అతిపెద్ద అవకాశంగా మారాయి.
ఇది కూడా చదవండి: కేజ్రీవాల్ బాటలో దుర్గేష్.. న్యాయమూర్తికి షాకింగ్ లేఖ


