న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు అనూహ్య నిర్ణయాలతో కోర్టు విచారణకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందుకు విచారణకు వెళ్లేది లేదని తేల్చిచెప్పగా, ఇప్పుడు మరో కీలక నేత కూడా అదే బాట పట్టారు. దీంతో ఈ హై-ప్రొఫైల్ కేసు విచారణ ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
న్యాయమూర్తికి దుర్గేష్ పాఠక్ లేఖ
ఆప్ ముఖ్య నేత దుర్గేష్ పాఠక్ సైతం ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు హాజరుకానని స్పష్టం చేశారు. ఈ మేరకు జస్టిస్ స్వర్ణ కాంత శర్మకు ఆయన ఒక లేఖ రాశారు. ‘నేను అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా నిలబడుతున్నాను. ఈ కేసులో నేను హాజరు కాలేను. నా తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టుకు రారు’ అని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు.
పలు ఆరోపణలతో బహిష్కరణ
ఢిల్లీ హైకోర్టు విచారణలో పక్షపాతం, ప్రయోజనాల వైరుధ్యం ఉన్నాయనే ఆరోపణలతో తాను వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరు కాబోనని కేజ్రీవాల్ ఇంతకు ముందుగానే ప్రకటించారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదంటూ, తన తరఫున ఏ లాయర్‌ను పెట్టుకోబోనని మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు దుర్గేష్ నిర్ణయంతో ఆప్ నేతల వ్యూహం మరింత స్పష్టమైంది.
రాజ్‌ఘాట్ వద్ద ఆప్ నేతల నివాళులు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆయన వెంట మనీష్ సిసోడియా, ఢిల్లీ విపక్ష నేత అతిశీ సహా పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. తనకు న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని, గతంలో కూడా న్యాయస్థానాలు తనకు బెయిల్ మంజూరు చేశాయని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: ‘ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే హ్యాట్రిక్’.. ప్రధాని మోదీ


