‘ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే హ్యాట్రిక్’.. ప్రధాని మోదీ | Modi Predicts BJP HatTrick on May 4 | Sakshi
Sakshi News home page

‘ఐదు రాష్ట్రాల్లో బీజేపీదే హ్యాట్రిక్’.. ప్రధాని మోదీ

Apr 29 2026 1:09 PM | Updated on Apr 29 2026 1:47 PM

Modi Predicts BJP HatTrick on May 4

హర్దోయ్‌: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ‘హ్యాట్రిక్’ విజయం ఖాయమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలోని హర్దోయ్‌లో బుధవారం గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికగా బెంగాల్ ఎన్నికల తీరును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రశంసిస్తూనే, భవిష్యత్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


యూపీకి జీవనాడి: గంగా ఎక్స్‌ప్రెస్‌వే
యూపీలోని హర్దోయ్ వేదికగా మీరట్, ప్రయాగ్‌రాజ్ నగరాలను కలుపుతూ నిర్మించిన ప్రతిష్టాత్మక గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని మోదీ  ప్రారంభించారు. ఈ అత్యాధునిక రహదారి గంగామాత ఆశీర్వాదమని, రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని అత్యంత సులభతరం చేస్తుందని అన్నారు. కేవలం రవాణాకే పరిమితం కాకుండా, ఈ బృహత్తర ప్రాజెక్టు యావత్ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికే ఒక జీవనాడి (లైఫ్‌లైన్) లాంటిదని మోదీ అభివర్ణించారు.
 

ఏడు దశాబ్దాల్లో తొలిసారి.. భయం లేని బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్‌పై మోదీ హర్షం వ్యక్తం చేశారు. గత ఆరేడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విధంగా, ఎలాంటి భయం లేని వాతావరణంలో బెంగాల్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమన్నారు. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న పొడవైన క్యూ లైన్లే ఇందుకు సాక్ష్యమని అన్నారు. మొదటి దశ తరహాలోనే పోలింగ్ ముగిసేవరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆయన బెంగాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
 

మే 4న సంచలనం.. 5 రాష్ట్రాల్లో బీజేపీదే హ్యాట్రిక్
ఇటీవలే ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే జోరుతో రాబోయే మే 4వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ ఘనవిజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తుందని ఆయన  ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు అభివృద్ధి వైపే నిలుస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement