Nupur Sharma: మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి.. మళ్లీ సుప్రీంకు నూపుర్‌

Nupur Sharma Approaches SC Again Over Threats - Sakshi

ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ప్రవక్త కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్‌ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం నుంచి ఊహించని స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాక.. బెదిరింపులు, వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని ఆమె తాజా అభ్యర్థన పిటిషన్‌ను అదే బెంచ్‌ ముందు దాఖలు చేశారు. 

తన అరెస్టును నిలువరించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె మరోసారి కోర్టులో అభ్యర్థించారు. ఇదిలా ఉంటే ఆమె పిటిషన్‌పై ఇవాళ(మంగళవారం) విచారణ చేపట్టే అవకాశం ఉంది. గతంలో విచారణ సందర్భంగా ఆమె అభ్యర్థనపై స్పందించిన బెంచ్‌.. సంబంధిత హైకోర్టు(ఢిల్లీ)ను సంప్రదించాలని ఆమె తరపు న్యాయవాదికి సూచించారు. అయినప్పటికీ ఆమె మరోసారి సుప్రీంను ఆశ్రయించడం విశేషం.

జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం జులై 1వ తేదీన నూపుర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులకు నిరసన సెగ తగిలింది. అంతేకాదు పలువురు మేధావులు, రిటైర్డ్‌ జడ్జిలు, బ్యూరోక్రట్లు, రాజకీయ నేతలు సైతం తీవ్రంగా తప్పుబడుతూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఒక బహిరంగ లేఖ రాశారు కూడా. 

అయితే ఆ నాటి నుంచి తనకు అత్యాచార, చావు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయని ఆమె తాజా అభ్యర్థనలో పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని ఢిల్లీకి బదలాయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మరోసారి ఆమె సుప్రీంలో పిటిషన్‌ వేసింది. ఈ గ్యాప్‌లో ఆమెపై మరో మూడు చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం గమనార్హం.

చదవండి: బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top