భారత్‌ ఎవరికీ తలవంచదు  | No power in the world can make India bow down Says Pm Narendra Modi | Sakshi
Sakshi News home page

భారత్‌ ఎవరికీ తలవంచదు 

May 12 2026 2:03 AM | Updated on May 12 2026 2:03 AM

No power in the world can make India bow down Says Pm Narendra Modi

ఏ ప్రపంచశక్తీ భారత ప్రగతిని అడ్డుకోజాలదు 

సోమనాథ్‌ అమృత్‌మహోత్సవ్‌ కార్యక్రమంలో మోదీ వ్యాఖ్య 

సోమనాథ్‌ ఆలయంలో మహాపూజ చేసిన ప్రధాని 

వీర్‌ హమీర్జీ సర్కిల్‌ వద్ద భారీ రోడ్‌షో 

ఆకట్టుకున్న సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం వైమానిక విన్యాసాలు

సోమనాథ్‌(గుజరాత్‌): అమెరికా వంటి అగ్రరాజ్యాలకు సైతం ఏమాత్రం బెదరక భారత్‌ తన లక్ష్యసాధనలో సఫలీకృతమైందని ప్రధాని మోదీ శ్లాఘించారు. 1998లో పోఖ్రాన్‌ అణుపరీక్షలపై అమెరికా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్‌ ఏమాత్రం తన సంకల్పాన్ని సడలనివ్వలేదని మోదీ గుర్తుచేశారు. గుజరాత్‌లోని ప్రభాస్‌ పాటన్‌లో అరేబియా సముద్రతీరంలో ఆధునిక సోమనాథ్‌ ఆలయాన్ని పునర్‌నిర్మించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన అమృత్‌మహోత్సవ్‌ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ సోమవారం పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా సద్భావన మైదాన్‌లో నిర్వహించిన ‘సోమనాథ్‌ పునర్‌వైభవానికి 75 ఏళ్లు’సభలో మోదీ ప్రసంగించారు. ‘‘1947లో భారత్‌ విదేశీపాలకుల నుంచి స్వాతంత్య్రంపొందినప్పటికీ 1951లో సోమనాథ్‌లో ఆధునిక ఆలయంలో ప్రాణప్రతిష్ట జరిగిన క్షణంలోనే నిజమైన స్వేచ్ఛా స్ఫూర్తి దేశం నలుచెరుగులకూ వ్యాపించింది. సోమనాథ్‌లో జరుగుతున్న అమృత్‌ మహోత్సవం కేవలం ఒక స్మరణీయ కార్యక్రమం కాదు ఇది వచ్చే వెయ్యేళ్లపాటు మనకందించే స్ఫూర్తి సంబరం.

 మే 11 అనగానే కేవలం ఆధునిక సోమనాథ్‌ ఆలయ పునర్‌నిర్మాణం గుర్తుకురాదు నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలో 1998లో భారత్‌ చేపట్టిన అణుపరీక్షలూ ఇదే తేదీన జరిగాయి. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు దేశ అణుశక్తి సామర్థ్యాలు, సత్తాను యావత్‌ ప్రపంచానికి చాటిచెప్పారు. అణుపరీక్షల భూప్రకంపనలు ప్రపంచదేశాల్లో వణుకుపుట్టించాయి. కొన్ని దేశాల్లో ఆగ్రహజ్వాలలను రగిల్చాయి. అణుపరీక్షలు చేసే హక్కు భారత్‌కు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ పలు దేశాలు హూంకరించాయి.

 ఆర్థిక ఆంక్షల మాటున భారత్‌ను ఏకాకిని చేసే కుట్రలుచేశాయి. భారత్‌ను అణగదొక్కేందుకు ప్రపంచశక్తులు ఏకమయ్యాయి. కఠిన ఆంక్షలనూ ఇండియాపై మోపారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇంకేదైనా దేశమైతే కూలబడేదే. కానీ భారత్‌ విభిన్నం. అన్నింటినీ తట్టుకుని భారత్‌ సగర్వంగా నిలబడింది. అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లున్నా 13న మరోసారి అణుపరీక్షలుచేసింది. మే 11న శాస్త్రవేత్తలు తమ ఆరంభకార్యాలను పూర్తిచేయగా 13న మరోరెండు అణుపరీక్షలుచేసి వాజ్‌పేయీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ రాజకీయ సంకల్పాన్ని రుజువుచేశారు’’అని మోదీ అన్నారు.  

మూలాలు మర్చిపోవద్దు 
‘‘మూలాలను మర్చిపోయిన దేశం పటిష్టంగా ఉండలేదన్న సత్యాన్ని సోమనాథ్‌ మనకు ప్రబోధిస్తోంది. అద్భుత సోమనాథ్‌ను నాశనంచేసేందుకు చరిత్రలో పలుమార్లు విదేశీ పాలకులు, చొరబాటుదారులు ఎంతగానో ప్రయత్నించారు. పునర్‌నిర్మించినా మళ్లీ కూల్చేశారు. అయినాసరే ఆలయం పునర్‌నిర్మితమైంది. ఇది నిరంతరంగా కొనసాగింది. ఆలయాన్ని నాశనంచేసినట్లే దేశాన్ని సైతం కొన్ని శక్తులు బుజ్జగింపు రాజకీయాలతో భ్రష్టుపట్టించాయి. అలాంటి ఆలోచన ధోరణితోనే కొన్ని శక్తులు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలనిచూశాయి. జాతి ప్రతిష్ట, గుర్తింపునకు సంబంధించిన ఇలాంటి అంశాల్లోకి ఒక్కోసారి రాజకీయాలు చొరబడుతుంటాయి’’అని అన్నారు. 

నెహ్రూ వద్దన్నా పటేల్‌ పట్టుబట్టారు 
‘‘ఆలయ నిర్మాణంపై నెహ్రూ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయినాసరే ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్, తొలి రాష్ట్రపతి డాక్టర్‌రాజేంద్ర ప్రసాద్‌ ఆధునిక సాంస్కృతిక సౌధం సోమనాథ్‌ పునర్‌నిర్మాణానికి పట్టుబట్టి సాధించారు. అయోధ్యలో భవ్యమందిర నిర్మాణానికి పూనుకున్నప్పుడూ ఇలాంటి శక్తులు అడ్డుతగిలాయి. అయినాసరే మనం అభివృద్ధి, వారసత్వ పరంపరను ముందుకు తీసుకెళ్లాల్సిందే. గతంలో ఇలాంటి సాంస్కృతిక కేంద్రాలను నిర్లక్ష్యంచేసిన ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నాం. నేటి భారతంలో సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి అవిభాజ్యాలు. జంటగా పురోభివృద్ధి సాధించాల్సిందే’’అని అన్నారు. ఈ సందర్భంగా మోదీ సోమనాథ్‌ ఆలయానికి సంబంధించిన స్మారక తపాళాబిళ్లను ఆవిష్కరించారు. 

దారిపొడవునా జనసందోహం 
అంతకుముందు జామ్‌నగర్‌ నుంచి గిర్‌ సోమనాథ్‌ జిల్లాకు మోదీ హెలికాప్టర్‌లో చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి వీర్‌ హమీర్జీ కూడలి దాకా కిలోమీటర్‌ దూరానికిపైగా పొడవున మార్గంలో మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. దారి పొడవునా సోమనాథ్‌ వాసులు మోదీకి పూలవర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు. జెండాలు చేతబట్టుకుని మోదీకి అనుకూలంగా నినాదాలుచేశారు. మార్గమధ్యంలో పలు చోట్ల పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చిన సంప్రదాయ కళాకారులు సంప్రదాయ నృత్యాలుచేసి స్థానికులను అలరించారు. సోమనాథ్‌ అనేది దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది.  

ఆలయంలో మోదీ ప్రత్యేక పూజ 
అంతకుముందు మోదీ సోమనాథ్‌ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోకి రాగానే పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నరేంద్ర మోదీ గర్భగుడిలో సోమలింగానికి జలాభిషేకం చేశారు. తర్వాత మహాపూజ క్రతువును పూర్తిచేశారు. ఇదే సందర్భంలో దేశంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో పండితులు ఆలయ శిఖరంపై ఉన్న కలశాలకు మహాభిషేకంచేశారు. 

ఈ సందర్భంగా హెలికాప్టర్లు గులాబీ పూరేకులతో ఆలయంపై పూలవాన కురిపించారు. ధ్వజపూజ సైతం చేశారు. తర్వాత అక్కడి సందర్శకుల పుస్తకంలో రాశారు. ఓంకార మంత్ర జపించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి పండితులు చెప్పిన సోమనాథ్‌ అనుబంధ గాథలను మోదీ సైతం విన్నారు. తర్వాత భారతవాయుసేనకు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం ఒళ్లు జలదరించేలా చేసిన వైమానిక విన్యాసాలను మోదీ తిలకించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భుపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సింఘ్వీ సైతం పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement