పెట్రోల్‌, గ్యాస్‌ కొరత వచ్చేసిందా? మోదీ వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ | Central Govt Confirms No Shortage Of Petrol, Diesel, LPG Despite Global Tensions, Citizens Urged Not To Panic | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, గ్యాస్‌ కొరత వచ్చేసిందా? మోదీ వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ

May 11 2026 5:48 PM | Updated on May 11 2026 8:11 PM

No petrol or diesel shortage govt assures

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ, ముడి చమురు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇంధనం ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.

పశ్చిమాసియాలో పరిస్థితులపై సోమవారం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ ప్రభావం మనపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

భయంతో అధికంగా కొనుగోలు చేయొద్దు 
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మార్కెటింగ్‌, ఆయిల్‌ రిఫైనరీ) శర్మ మాట్లాడుతూ.. దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. భారత్‌కు వచ్చే ఇంధన దిగుమతుల్లో దాదాపు 90 శాతం గల్ఫ్‌ ప్రాంతం నుంచే వస్తున్నాయని, అయినా అంతరాయాన్ని తగ్గించే చర్యలు వేగంగా చేపట్టామని చెప్పారు.

దేశంలో అన్ని రకాల ఇంధన సరఫరాలు తగినంత ఉన్నాయని, భయంతో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని శర్మ తెలిపారు. ప్రపంచ అనిశ్చితి సమయంలో దేశంపై ఆర్థిక భారం తగ్గించడం, ఇంధన పొదుపు లక్ష్యంతోనే ప్రధానమంత్రి వాటిపై ఆదివారం ఆ పిలుపును ఇచ్చారని చెప్పారు. సరఫరాలపై ప్రభావం అత్యల్పంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఇంధన పొదుపు లక్ష్యంతోనే..
అవసరంలేని ప్రయాణాలు తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన సందేశాన్ని, సరఫరా కొరతకు ప్రతిస్పందనగా కాకుండా ఇంధన పొదుపు దృష్టితో చూడాలని అధికారులు తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న సమయంలో బాధ్యతాయుతంగా ఇంధనం వినియోగించాలనే ఉద్దేశంతో ఈ పిలుపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అనేక దేశాల నుంచి దిగుమతులు
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. ఇంధన సంరక్షణ, సరఫరా చర్యల్లో భాగంగా భారత్‌ అనేక దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటనపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బ్రిక్స్‌ దేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, ప్రణాళికలు ఖరారైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

పశ్చిమాసియా పరిస్థితులపై భారత్‌ వైఖరిని కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మొదటి నుంచే శాంతి, చర్చలకు భారత్‌ మద్దతు ఇస్తోందని తెలిపారు. భారత నౌకలు సురక్షితంగా తిరుగు ప్రయాణం చేస్తున్నాయని పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ అధికారి ఒపేష్‌ శర్మ తెలిపారు. 

భారత జెండా ఉన్న 10 నౌకలు ఇప్పటివరకు అదనపు రుసుములు చెల్లించకుండా హార్మూజ్‌ జలసంధి దాటి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఇంకా 13 భారత జెండా నౌకలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయని, వాటిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నౌక సిబ్బంది సంక్షేమం, వారి అవసరాలను కూడా ప్రతిరోజూ పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, పెట్రో ధరల పెంపుపై మాత్రం కేంద్ర సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement