
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదం అంశానికి సంబంధించి తనిఖీకి అనుమతిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ప్రధాని మోదీ విద్యకు సంబంధించిన రికార్డులను బహిరంగ పర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై గత కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నరేంద్ర మోదీ.. బీఏ డిగ్రీ పూర్తి చేశారని చెబుతున్న నేపథ్యంలో, ఆ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే 2016లో కేంద్ర సమాచార కమిషన్.. మోదీ డిగ్రీ రికార్డులను తనిఖీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ యూనివర్సిటీ. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) సీఐసీ ఆదేశాలను కొట్టేసింది. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది తెలుసుకునే హక్కు కంటే మిన్న అని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల రికార్డులు,.. ఆర్టీఐ చట్టం కింద బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చింది.
మోదీ డిగ్రీ వివరాలను కోర్టుకు అందించేందుకు యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నా, అవి అపరిచితులతో పంచుకోవడం గోప్యత ఉల్లంఘన అవుతుందని ఢిల్లీ యూనివర్శిటీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు.. సీఐసీ ఆదేశాలను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. తాజా హైకోర్టు తీర్పుతో ఇప్పటి వరకూ మోదీ డీగ్రీ వివాదంపై జరుగుతున్న రాజకీయ వివాదానికి దాదాపు ముగింపు దొరికినట్లే కనబడుతోంది.