నింగిలోకి ప్రధాని మోదీ ఫొటో

New satellite to carry Bhagavad Gita, PM Narendra Modi photo  - Sakshi

న్యూఢిల్లీ: భగవద్గీత పుస్తకం, ప్రధాని మోదీ చిత్రపటం, 25 వేల మంది పౌరుల పేర్ల జాబితాను ఈ దఫా నింగిలోకి తీసుకుపోయేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. వీటిలోని ఒక శాటిలైట్‌లో మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, పౌరుల పేర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫిబ్రవరి 28న పీఎస్‌ఎల్‌వీ సీ–51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా–1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్‌ ధావన్, యునిటీశాట్‌ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 శాటిలైట్లను ప్రయోగించనుంది. వీటిలో ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్, సతీశ్‌ ధావన్‌(ఎస్‌డీ శాట్‌)ను చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్‌ (శ్రీపెరంబుదూర్‌), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌(నాగ్‌పుర్‌), శ్రీశక్తి శాట్‌ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు.

వీటిలో సతీష్‌ధావన్‌ శాటిలైట్‌లో మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్‌ మిషన్‌’∙పదాలు, భగవద్గీత కాపీ, 25000 మంది పౌరుల పేర్ల జాబితాను తీసుకెళ్లనున్నట్లు స్పేస్‌ కిడ్జ్‌ సీఈవో డాక్టర్‌ శ్రీమతి కేసన్‌ తెలిపారు. అంతరిక్షంలోకి పేర్లను పంపేందుకు అడిగిన వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయన్నారు. వీరందరికీ బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చామన్నారు. ప్యానెల్‌ దిగువన ఇరువైపులా ఇస్రో చైర్మన్‌ శివన్, సైంటిఫిక్‌ సెక్రటరీ ఉమామహేశ్వరన్‌ పేర్లను చెక్కినట్లు తెలిపారు. విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. ఇదే తరహాలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్నామని డాక్టర్‌ శ్రీమతి వెల్లడించారు. పీఎస్‌ఎల్‌వీ సీ–51 వాహకనౌకను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top