‘నీట్‌’ పరీక్ష రద్దు | NEET Exam for admission to undergraduate medical education cancelled over paper leak allegations | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ పరీక్ష రద్దు

May 13 2026 3:01 AM | Updated on May 15 2026 9:58 AM

NEET Exam for admission to undergraduate medical education cancelled over paper leak allegations

పేపర్‌ లీక్‌ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌టీఏ కీలక నిర్ణయం  

అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి.. త్వరలో పరీక్ష తేదీ ప్రకటన.. మళ్లీ అడ్మిట్‌ కార్డుల జారీ  

రుసుము చెల్లించకుండా మరోసారి పరీక్షకు హాజరయ్యే అవకాశం  

లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం.. మాస్టర్‌మైండ్‌ సహా 20 మందిని అదుపులోకి తీసుకున్న రాజస్తాన్‌ ఎస్‌ఓజీ  

గెస్‌ పేపర్‌లోని కొన్ని ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంలో ప్రత్యక్షం  

పరీక్షకు 15 రోజుల ముందే కొందరు అభ్యర్థులకు చేరిన గెస్‌ పేపర్‌  

సాక్షి, న్యూఢిల్లీ:  వైద్య విద్య అభ్యసించి, డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తూ జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఆశయంతో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌)కు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పిడుగులాంటి వార్త వినిపించింది. దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్‌(యూజీ)–2026 పరీక్షను రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. నీట్‌ ప్రశ్నపత్నం లీక్‌ అయినట్లు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేసింది. నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐని కేంద్రం ఆదేశించిందని, దర్యాప్తు సంస్థకు తమ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని, అవసరమైన రికార్డులు సమకూరుస్తామని ఎన్‌టీఏ స్పష్టంచేసింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత.. అంటే మే 7న సాయంత్రం అవకతవకలకు సంబంధించిన సమాచారం ఎన్‌టీఏకు అందింది. స్వతంత్ర ధ్రువీకరణతోపాటు అవసరమైన చర్యల కోసం మే 8వ తేదీ ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థలకు నివేదించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.  

పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడేందుకే..  
పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ‘గెస్‌ పేపర్‌’కొందరు అభ్యర్థుల మధ్య సర్క్యులేట్‌ అయ్యిందని, అందులో 120 కెమిస్ట్రీ, 100కు పైగా బయాలజీ ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంతో యథాతథంగా సరిపోలాయన్న ప్రచారంతో ‘నీట్‌’ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఈ నెల 3న భారత్‌తోపాటు విదేశాల్లో జరిగిన నీట్‌(యూజీ)–2026 పరీక్షను 22.79 లక్షల మంది రాశారు.

పేపర్‌ లీకేజీతో వారంతా నిరాశకు గురయ్యారు. పరీక్ష మళ్లీ నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్‌టీఏ ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలియజేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల అభ్యర్థులకు, తల్లిదండ్రులకు అసౌకర్యం కలిగే మాట నిజమేనని ఎన్‌టీఏ అంగీకరించింది. కానీ, పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడేందుకు నీట్‌ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.  

‘గెస్‌ పేపర్‌’కోసం రూ.30 లక్షలు  
‘గెస్‌ పేపర్‌’కోసం ఒక్కో విద్యార్థి దాదాపు రూ.30 లక్షల చొప్పున వెచ్చించినట్లు తమ విచారణలో తేలిందని రాజస్తాన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌(ఎస్‌ఓజీ) ఏడీజీ విశాల్‌ బన్సాల్‌ మీడియాకు తెలిపారు. ఈ గెస్‌ పేపర్‌ పరీక్షకు 15 రోజుల ముందే అభ్యర్థులకు చేరిందన్నారు. డెహ్రాడూన్‌ నుంచి కేరళ మీదుగా సికార్‌కు చేరిన ఈ పేపర్‌ను ఒక్కో విద్యార్థి రూ.20 వేల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడిందన్నారు.

పరీక్ష ముందు రాత్రి అంటే.. మే 2వ తేదీ రూ.30 వేలకు కూడా కాపీలు అమ్మినట్లు ఆధారాలు లభించాయని ఎన్‌టీఏకు, కేంద్ర పభుత్వానికి నివేదించారు. ఎస్‌ఓజీ దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో ఇప్పటివరకు మాస్టర్‌మైండ్‌ సహా 20 మందికి పైగా అదుపులోకి అనుమానితులను తీసుకున్నట్లు సమాచారం. నీట్‌ పేపర్‌ లీకేజీకి జైపూర్‌కు చెందిన మనీష్‌ అనే వ్యక్తిని మాస్టర్‌ మైండ్‌గా గుర్తించారు. రాజస్తాన్‌లో సికార్‌ పట్టణానికి చెందిన ఒక కోచింగ్‌ కెరీర్‌ కౌన్సెలర్‌ను అరెస్టు చేశారు.  

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ  
నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది. పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎన్‌టీఏ స్పందించి పరీక్షను రద్దు చేసింది. లీకేజీ వ్యవహారంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాజస్తాన్‌ పోలీసుల దర్యాప్తులో లభించిన వాట్సాప్‌ చాటింగ్‌లు, స్క్రీన్‌షాట్లు, బ్యాంక్‌ లావాదేవీల వివరాలు, యూపీఐ చెల్లింపులు, క్రిప్టో చెల్లింపులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. పరీక్ష జరిగిన అన్ని సెంటర్ల సీసీటీవీ ఫుటేజీ, బయోమెట్రిక్‌ డేటాను సేకరించారు. ఆ డేటాను, ఆధారాలను రాజస్తాన్‌ పోలీసులు సీబీఐకి అప్పగించారు. నీట్‌(యూజీ) పేపర్‌ లీక్‌ అంశంపై సీబీఐ మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.  

ముఖం చాటేసిన విద్యాశాఖ మంత్రి  
నీట్‌ పేపర్‌ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మౌనం వహించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, తప్పించుకుని కారెక్కి వెళ్లిపోయారు.  

మహారాష్ట్రలో వ్యక్తి అరెస్టు 
నీట్‌ పేపర్‌ లీక్‌ అంశానికి సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్‌ పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడానికి రాజస్తాన్‌ పోలీసుల బృందం రానున్నట్లు పేర్కొన్నారు.  



సందేహాలు – సమాధానాలు
నీట్‌ రద్దు కావడంతో అభ్యర్థులు, తల్లిదండ్రుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిపై నీట్‌ వర్గాలు కొంత స్పష్టత ఇచ్చాయి.  

మళ్లీ పరీక్ష ఎప్పుడు? 
నీట్‌ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదు.

 మళ్లీ రిజిస్టర్‌ చేసుకోవాలా? 
అవసరం లేదు. ఇప్పటికే చేసుకున్న రిజిస్ట్రేష‌న్‌ డేటా, అభ్యర్థిత్వాన్ని త్వరలో మళ్లీ నిర్వహించే పరీక్షకు బదిలీ చేస్తారు.

 ఫీజు చెల్లింపు మాటేమిటి?  
ఈ ఏడాది నీట్‌ రాసిన అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయడానికి అదనంగా ఫీజులు చెల్లించాల్సిన పనిలేదు. గతంలో చెల్లించిన రుసుమును అభ్యర్థులకు తిరిగి(రీఫండ్‌) చెల్లిస్తారు.  

 అడ్మిట్‌ కార్డులు కొత్తగా ఇస్తారా?  
అవును. కొత్త అడ్మిట్‌ కార్డుల జారీపై త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారు.  

 పరీక్షా కేంద్రాలను మారుస్తారా?  
మే 3న జరిగిన పరీక్షకు ఎంచుకున్న కేంద్రాలనే తిరిగి నిర్వహించే పరీక్షకు కూడా కొనసాగిస్తారు.

పది రోజుల్లోగా  షెడ్యూల్‌: ఎన్‌టీఏ డైరెక్టర్‌
నీట్‌ పునఃపరీక్ష షెడ్యూల్‌ను రాబోయే 7 నుంచి 10 రోజుల్లోగా ప్రకటిస్తామని ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. అతి త్వరలో తన బృందంతో చర్చిస్తానని, పూర్తి పరీక్షల షెడ్యూల్, తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. మెడికల్‌ కాలేజీల విద్యా క్యాలెండర్, ప్రవేశాల షెడ్యూల్‌కు అంతరాయం కలగకుండా వీలైనంత తక్కువ సమయంలోనే పరీక్ష నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పారు. మరో వారం, పది రోజుల్లోగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. లీకేజీ ఘటన నిజంగా బాధాకరమని, ఇలాంటివి తక్షణమే ఆగిపోవాలని అభిషేక్‌ సింగ్‌ తేల్చిచెప్పారు. 

పేపర్‌ లీకేజీలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే మొత్తం వ్యవస్థకు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. జరిగిన దానికి తాము బాధ్యత తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. నీట్‌కు ముందు విద్యార్థుల మధ్య పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో సర్క్యులేట్‌ అయిన కొన్ని ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడంతో పరీక్షను రద్దు చేయాలని తాము సిఫార్సు చేశామని వివరించారు. మొత్తం పేపర్‌ లీక్‌ కాలేదని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement