నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
National Cancer Awareness Day :ఎన్నో భయాలు, ఎన్నో ప్రతికూలతలలో నుంచి బయటికి వచ్చి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లిన స్టార్స్ వీరు. సోనాలి బింద్రే నుంచి హీనా ఖాన్ వరకు ఎంతోమంది స్టార్స్ క్యాన్సర్ సర్వైవర్స్ మాత్రమే కాదు వారియర్స్ కూడా. సదస్సులలో ప్రసంగించడం నుంచి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం వరకు క్యాన్సర్‌పై అవగాహన కోసం ఎంతో పనిచేస్తున్నారు...
సోనాలి బింద్రేకు స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు 2018లో నిర్ధారణ అయిన తరువాత ఆమె, ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు షాక్ అయ్యారు. న్యూయార్క్‌లో ఆరు నెలల చికిత్స తర్వాత సోనాలి బింద్రే ముంబైకి తిరిగి వచ్చింది. ఆమె క్యాన్సర్ చికిత్సలు అక్కడితో ముగియక΄ోయినా క్యాన్సర్ అవగాహన కోసం నడుం కట్టింది. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, క్యాన్సర్‌పై అవగాహన కోసం ప్రచారకర్తగా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలు పొందుతున్న వేలాది మందికి స్ఫూర్తిగా మారాయి. ఎంతో ధైర్యాన్నిచ్చాయి.
తాను దిగులు పడిన కాలం, ఆ దిగులు, నిరాశ నీడల నుంచి బయటపడి ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్న కాలం గురించి మాటల రూపంలోనో, రచనల రూపంలోనో చెబుతూనే ఉంది సోనాలి. తనకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన క్షణం నుంచి అందులో నుంచి బయటపడే వరకు ఆమె ఏడ్చింది, నవ్వింది, గెలిచింది!
(ప్రముఖ గాయని, నటి కన్నుమూత, సరిగ్గా అదే రోజు)
మందులే కాదు మానసిక బలం కూడా...
అది 2012 సంవత్సరం. గతంలో ఎన్నడూ లేనంతగా తరచుగా అలసి΄ోయేది మనీషా కోయిరాలా. కడుపు ఉబ్బిపోయేది. నొప్పిగా ఉండేది. చాలామంది మహిళలలాగే మనీషా కూడా తన ఇబ్బందిని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఆరోగ్యం క్షీణించడం మొదలైన తరువాత డాక్టర్ దగ్గరకు వెళ్లింది.ఎన్నో పరీక్షల తరువాత వైద్యులు ఆమెకు షాకింగ్ న్యూస్ చెప్పారు. మనీషాకు అండాశయ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఆమె భయపడింది. గందరగోళంలో పడింది. గుండె పగిలిపోయినంతగా ఏడ్చింది.
‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే కుదరదు’ అని తనకు తాను చెప్పుకొని ధైర్యం తెచ్చుకుంది. ‘క్యాన్సర్‌తో పోరాటం అనేది మందులకు పరిమితమైన విషయం కాదు. మానసిక బలం ఉండాలి’ అంటున్న మనీషా చికిత్స కాలంలో తనలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిర్మించుకోవడానికి, మనశ్శాంతికి చేరువ కావడానికి మానసిక నిపుణులను సంప్రదించింది. క్యాన్సర్‌పై పోరాడే క్రమంలో కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు అన్ని రకాలుగా అండగా ఉన్నారు. ఇప్పుడు మనీషాఎంతోమంది బాధితులకు అండగా నిలుస్తోంది. క్యాన్సర్ అని నిర్ధారణ అయిన వ్యక్తులకు ధైర్యం చెప్పి, అండగా నిలుస్తోంది. క్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి ఎన్నో సదస్సులలో ప్రసంగించింది. క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటున్న ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలోని ప్రాముఖ్యత గురించి నొక్కి చెబుతోంది. అండాశయ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ‘ఓవాకోమ్’లాంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ర్యాలీలు, క్యాన్సర్ బాధితుల కోసం నిధుల సేకరణ కార్యక్రమాలలో పాల్గొంటుంది.
ఒక మేలుకొలుపు
తనకు బ్లడ్‌క్యాన్యర్ అని 2009లో నిర్ధారణ అయిన తరువాత మోడల్, నటి లిసా రేకు చికిత్స మొదలైంది. శారీరక మార్పులు మొదలయ్యాయి. అయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. ఆత్మస్థైర్యం అనే ఆయుధాన్ని వదల్లేదు. ‘ఇది నాకు పునర్జన్మ’ అంటున్న రే క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో తన అనుభవాలను ‘ది ఎల్లో డైరీస్’ పేరుతో రాసింది.
‘క్యాన్సర్ అనేది పెద్ద మేలుకొలుపులాంటిది. క్యాన్సర్‌పై మరింత అవగాహన పెరగాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొంటాను. అది నా కెరీర్‌లో భాగం’ అంటుంది లిసా రే.
ఆ సంకేతాలు పసిగట్టాలి
రొమ్ము క్యాన్సర్ బారిన పడిన హీనా ఖాన్ భయంతో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తన ధైర్యమే తనను ముందుకు నడిపించింది. క్యాన్సర్‌పై పోరాటం గురించి తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియా వేదికగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కలిగిస్తోంది.
‘ముందస్తు సంకేతాల ద్వారా ఆరోగ్య సమస్యల గురించి మన శరీరం తెలియజేస్తుంది. రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎప్పుడు ఇబ్బందిగా అనిపించినా, అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించాలి’ అంటుంది హీనా ఖాన్.
(నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : చిన్మయి ఫైర్)
అవగాహన కోసం అక్షరాలా...
అండాశయ క్యాన్సర్‌పై తన అనుభవాలు, పోరాటం గురించి ‘హీల్డ్’ పేరుతో పుస్తకం రాసింది మనీషా కొయిరాలా. లిసా రే రాసిన ‘క్లోజ్ టు ది బోన్’ పుస్తకంలో ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలతో పాటు క్యాన్సర్‌పై తన పోరాటానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ సర్వైవర్‌ల స్ఫూర్తిదాయకమైన జీవితకథలపై డా.సోనమ్ వర్మ రాసిన పుస్తకాన్ని బాలీవుడ్ నటి టిస్కా శర్మ ఆవిష్కరించింది. బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన తన అనుభవాల గురించి స్టాండప్–కమేడియన్, నటి టిగ్ నొటరో ‘ఐయామ్ జస్ట్ ఏ పర్సన్’ పుస్తకం రాసింది. స్వయంగా రచయిత్రి అయిన సోనాలి బింద్రేకు కాన్యర్ చికిత్స సమయంలో కొన్ని పుస్తకాలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అందులో కొన్ని... ది లాస్ట్ బ్లాక్ యూనికార్న్–టిఫనీ హడిష్, ఇకిగై–హెక్టర్ గార్సియా, ఫ్రాన్సిస్క్ మిరల్లెస్, ది టావో ఆఫ్ బిల్ ముర్రే–గవిన్ ఎడ్వర్ట్స్.

ఇదీ చదవండి: మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’


