National Bird Day 2022: బుల్లి గువ్వా.. ఎక్కడమ్మా నీ సవ్వడి

National Bird Day 2022 Sakshi special story

సాక్షి, హైదరాబాద్‌:  పొద్దున్నే లేవగానే ఉదయిస్తున్న సూర్యుడినీ, అప్పుడే  విచ్చుకుంటున్న పువ్వుల్ని, పసి పాపల నవ్వుల్ని చూస్తే మనసుకు భలే హాయిగా ఉంటుంది కదా. అలాగే బాల్కనీలో కూర్చుని  వేడి వేడి కాఫీ తాగుతూ  చిరప్‌ చిరప్‌ అంటూ ఎగిరే బుజ్జి  బుజ్జి పిట్టల్ని, పావురాల్ని, పిచ్చుకల్ని చూస్తోంటే వచ్చే ఆనందాన్ని మీరు ఎపుడైనా ఆస్వాదించారా? ఆ ఇపుడు అవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటారా? ఆ ఆవేదన నుంచి  వచ్చిందే జాతీయ పక్షుల దినోత్సవం. అంతరించిపోతున్న పక్షుల్ని, కాపాడుకునేందుకు, పక్షుల అవసరం, ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతీ ఏడాది జనవరి 5న నేషనల్‌ బర్డ్‌ డే ని పాటిస్తాం.


పెంపుడు జంతువులైన కోళ్లు, బాతులతో పాటు పావురాలు, నెమళ్లు, చిలుకలు, పిచ్చుకలు, కోకిల. కాకులు, వడ్రంగిపిట్టలు, గద్దలు, డేగలు తదితర పక్షులు  జీవన పరిణామ క్రమంలో,  మానవ జీవితాల్లో, మనుషుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కానీ. పర్యావరణ వ్యవస్థలలో  కాలానుగుణ మార్పులతో దురదృష్టవశాత్తూ చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా నశించిపోతున్న అడవులు, సెల్‌ టవర్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా పిచ్చుకలు పూర్తిగా కనుమరుగవుతున్న సందర్భంలో మనం ఉన్నాం. దీనికి తోడు చట్టవిరుద్ధమైన పెంపుడు జంతువుల వ్యాపారం కారంణంగా మరింత ప్రమాదం కలుగుతోంది.  నిజానికి చాలా పక్షులు, పిట్టల పేర్లు నేటి తరానికి తెలియవు. కేవలం పుస్తకాల్లోనో, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లోనో చూసి తెలుసుకోవాల్సిన  దుస్థితి.

భారత్‌లో తగ్గిపోతున్న పక్షుల జాబితాలో గద్దలు, రాబందులు, పిచ్చుకలు, ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఉగాది సందేశాన్ని అందించే కోకిలమ్మను వెతుక్కోవాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక వాగులు, చెరువుల్లోకి వలస వచ్చే పక్షులు కూడా భారీ తగ్గుదల కనిపిస్తోందని పలు అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య జీవావరణ శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయమైపోయాయట. అలాగే ఒకప్పుడు ఆస్ట్రేలియా ఆగ్నేయ భాగంలో ఎక్కువగా కనిపించే రీజెంట్ హనీఈటర్ అనే పక్షి అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలోకి చేరిపోయింది. అంతేకాదు ఆడపక్షుల్ని తమ  పాటతో ఆకట్టుకునే మేల్‌ హనీఈటర్ పక్షులు తమ సహజసిద్ధమైన పాటను కూడా మర్చిపోతున్నాయంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రోజుకురోజుకు ఈ ముప్పు మరింత ముంచుకొస్తోంది. 

ఒకప్పుడు పావురాలు ప్రేమ సందేశాల్ని పంపేందుకు మాత్రమే కాదు కీలక సమాచారాన్ని చేరవేసే వార్తాహరులుగా పనిచేశాయి. సప్తవర్ణ రంజితమై పురి విప్పి ఆడే నెమలి నాట్యం, చిలుకలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే గూడు కట్టుకోవడంలో  చాలా పక్షుల నైపుణ్యానికి మన ఆధునిక ఇంజనీర్లు కూడా అబ్బురపడాల్సిందే. ఇక గిజిగాడు గూడు.. అదేనండి పిచ్చుక గూళ్లతో ప్రతీ పల్లె కళకళలాడుతూ ఉండేది. అంతేనా ఆకు ఈనెలతో తోకను చక్కగా అలంకరించుకునే చిలుకలు, చక్కటి గూడు అల్లుకునే బుజ్జిపిట్టలు.. అచ్చం చిన్నపిల్లల ఏడుపులా అరిచే పిట్టలు..అంతెందుకు పక్షిని చూసే కదా మన రైట్‌ బ్రదర్స్‌ విమానాల్ని సిద్ధం చేసింది. ఇలా మనం గమనించాలే గానీ ప్రకృతి అంతా టెక్నాలజీ మయం. ఇకనైనా  కనుమరుగవుతున్న వందల జాతుల పక్షుల మనుగడ కోసం పక్షి ప్రేమికుల్లాగా కృషి చేద్దాం. అన్నట్టు బర్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌. తెలంగాణ అటవీ శాఖ బర్డ్ వాక్‌ సెకండ్‌ యానివర్సరిలో భాగంగా జనవరి 8-9 తేదీల్లో  250 కంటే ఎక్కువ రకాల పక్షులను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. లెట్స్‌ గో అండ్‌ ఎంజాయ్‌..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top