ప్రధాని కళ్లలో భయం చూశా: రాహుల్‌ గాంధీ

My Name Is Not Savarkar says Rahul Gandhi On  BJP Apology Demand - Sakshi

సాక్షి, ఢిల్లీ: నా పేరు సావర్కర్‌ కాదు.. క్షమాపణలు కోరడానికి. నా పేరు గాంధీ.. ఎంపీగా అనర్హత వేటు పడిన మరుసటి రోజున.. పాత్రికేయ సమావేశంలో రాహుల్‌ గాంధీ భావోద్వేగంతో మాట్లాడిన మాటలు ఇవి.  ఇవాళ(శనివారం) మధ్యాహ్నాం ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. లండన్‌లో తాను చేసిన ప్రసంగానికి క్షమాపణలు చెప్పబోనంటూ తెగేసి చెప్పారు. 

ప్రధాన మంత్రి బహుశా నా తదుపరి ప్రసంగానికి భయపడి ఉంటారు. అందుకేనేమో నాపై అనర్హత వేటు వేశారు. ఆయన కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది. అందుకే నన్ను పార్లమెంట్‌లో మాట్లాడనివ్వకూడదని అనుకున్నారు అని రాహుల్‌ చెప్పుకొచ్చారు. ప్రధానిని కాపాడేందుకే ఈ డ్రామా జరుగుతోందన్న రాహుల్‌.. బీజేపీ నేతలు మోదీని ఎదురించే ధైర్యం లేదని అన్నారు.

లండన్‌ ప్రసంగంపై బీజేపీ క్షమాపణలకు డిమాండ్‌ చేస్తున్న విషయంపై స్పందించిన ఆయన.. నా పేరు సావర్కర్‌కాదని, నేను గాంధీని అని. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ప్రధాని ఒక గట్టి  ఆయుధం ఇచ్చారు. ప్రధాని చర్యలతో ఆయన చేసిన తప్పు గురించి చర్చ నడుస్తోంది. అదానీ ఒక అవినీతి, అక్రమార్కుడని దేశ ప్రజలకు తెలిసి పోయింది. అలాంటి వ్యక్తిని ప్రధాని ఎందుకు కాపాడాలని చూస్తున్నాడు?.  

లండన్‌ కేంబ్రిడ్జి ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. దేశీయ వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యానికి పురిగొల్పుతున్నానడంటూ రాహుల్‌ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ విమర్శను ఖండించిన రాహుల్‌, తన ప్రసంగంపై పార్లమెంట్‌లోనే స్పందిస్తానని స్పీకర్‌ను కోరానని, కానీ, అది జరగకుండా బీజేపీ అడ్డుకుందని విమర్శించారు. 

నాకు జైలు శిక్షా?.. ఐ డోంట్‌ కేర్‌. ఈ దేశం నాకు ప్రేమ, మర్యాద ఇచ్చింది. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. నా ముందు ఉంది ఒకే దారి.. సత్యం కోసం పోరాడడం. దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడడం. జీవితకాలం అనర్హత వేసినా, జీవితాంతం జైలులో ఉంచినా.. ప్రశ్నిస్తూనే ఉంటా. కోర్టు తీర్పుపై ఇప్పుడే తానేం స్పందించలేనని రాహుల్‌ చెప్పుకొచ్చారు. అసలు నేను బాధతో ఉన్నట్లు కనిపిస్తున్నానా? ఉద్వేగంతో ఉన్నా అంటూ మీడియా ముందు ఆయన తన ఉ‍త్సాహం బయటపెట్టారు. 

ఇదీ చదవండి: నేను అడిగింది ఒక్కటే ప్రశ్న..
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top