Murder Of Woman Living In Live In Relationship - Sakshi
Sakshi News home page

ముంబైలో నరరూప రాక్షసుడు..ప్రియురాలిని హతమార్చి.. ఆపై ‍కుక్కర్‌లో..

Jun 8 2023 9:53 AM | Updated on Jun 8 2023 1:58 PM

Murder of Woman Living in Live in Relationship - Sakshi

ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్‌ హత్య కేసు తరహాలోనే.. ఘోరం జరిగింది. సహజీవనం చేస్తున్న తన ప్రియురాలిని హత్యచేసి, ఆ మృతదేహాన్ని చైన్షా (చెట్లను నరికే యంత్రం) సాయంతో చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేశాడు నిందితుడు. అవి వాసన రాకుండా ఉండేందుకు వాటిని ప్రెజర్‌ కుక్కర్‌లో వేసి ఉడికించాడు.ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఉదంతం పట్టణంలోని మీరా రోడ్డు వద్దనున్న గీతా-ఆకాశ్‌దీప్‌ సొసైటీలో చోటుచేసుకుంది. సొసైటీలోని ఏడవ అంతస్థులో 56 ఏళ్ల మనోజ్ సహానీ 36 ఏళ్ల సరస్వతి వైద్యతో సహజీవనంలో ఉన్నాడు. వీరు చాలాకాలంగా కలిసే ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా వీరి ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రాసాగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే పోలీసులు సొసైటీకి చేరుకుని, మనోజ్‌ ఇంటి తలుపు తట్టారు. తలుపులు తీయగానే విపరీతమైన దుర్వాసన వెలువడింది.

ఆ ఇంటిలో పోలీసులు తనిఖీ చేపట్టగా, వారికి మహిళ మృతదేహపు ముక్కలు కనిపించాయి. పోలీసులు వెంటనే మనోజ్‌ను అరెస్ట్‌ చేసి, అతనిని ప్రశ్నించగా అవి తన ప్రియురాలు సరస్వతి మృతదేహపు ముక్కలు అని తెలిపాడు. పోలీసుల విచారణలో మనోజ్‌ తనకు సరస్వతికి గొడవ జరిగిందని, దీంతో ఆగ్రహంతో ఆమెను హత్య చేశానని తెలిపాడు. ఆ తరువాత మార్కెట్‌కు వెళ్లి చైన్షా కొనుగోలు చేసి, దానితో మృతదేహాన్ని ముక్కలు చేశానని, తరువాత వాటిని కుక్కర్‌లో ఉడికించానని తెలిపాడు. సాక్ష్యాధారాలు మాయం చేసేందుకే మనోజ్‌ ఈ పని చేశాడని పోలీసులు భావిస్తున్నారు.

ఆ మృతదేహపు ముక్కలను సమీకరించిన పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం తరలించారు. సంఘటనా స్థలంలో ఫారెన్సిక్‌ బృందం కూడా తనిఖీలు నిర్వహించి, పలు ఆధారాలు సేకరించింది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఫ్లాట్‌కు సీలు వేసిన పోలీసులు మనోజ్‌ను పశ్నిస్తున్నారు.

చదవండి: ‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement