Mumbai: హౌసింగ్ సొసైటీలో బక్రీద్ వివాదం.. రంగంలోకి పోలీసులు! | Mumbai's Mira Road Housing Society Sees Communal Tension Over Sacrificial Goats | Sakshi
Sakshi News home page

Mumbai: హౌసింగ్ సొసైటీలో బక్రీద్ వివాదం.. రంగంలోకి పోలీసులు!

May 27 2026 9:03 AM | Updated on May 27 2026 9:16 AM

Mumbai's Mira Road Housing Society Sees Communal Tension Over Sacrificial Goats

ముంబై: మహానగరం ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో గల ఒక హౌసింగ్ సొసైటీలో బక్రీద్ నేపథ్యంలో మేకల క్రయవిక్రయాలు, బలి ఇచ్చే అంశంపై తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సొసైటీ ఆవరణలో బలి కోసం మేకలను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు స్థానికులు, బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

వివాదం మొదలైంది ఇలా..
మీరా రోడ్‌లోని 'పూనం క్లస్టర్ 1' హౌసింగ్ సొసైటీలో 550కి పైగా ఫ్లాట్లు ఉన్నాయి. ఏటా బక్రీద్ సందర్భంగా ముస్లిం కుటుంబాలు మేకలను తెచ్చి బలి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి సొసైటీలో తాత్కాలిక షెడ్ వేయడంపై  కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బజరంగ్‌దళ్ కార్యకర్తలను సొసైటీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి కత్తితో దాడి చేయగా, అడ్డుకోబోయిన హర్ష సింగ్ అనే కార్యకర్త చేతికి గాయాలయ్యాయి.

పోలీసుల పహారా.. ఉద్రిక్త వాతావరణం
దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, అదనపు బలగాలతో  సొసైటీ పరిసరాల్లో మోహరించారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 100 మందికి పైగా బజరంగ్‌దళ్ సభ్యులు సొసైటీ బయట హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆందోళన చేశారు. ఉద్రిక్తతలు పెరగడంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఇంతలో బజరంగ్‌దళ్ సభ్యులు పందిని లోపలికి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు వెంటనే అడ్డుకుని వారిని చెదరగొట్టారు.

పరిష్కారం దిశగా..
పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలతో చర్చలు జరిపి, మున్సిపాలిటీ కేటాయించిన ప్రత్యేక ప్రాంతానికి మేకలను తరలించాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి మేకలను తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దాడికి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ వివాదంపై స్థానిక రాజకీయ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: హమాస్ మిలిటరీ చీఫ్ హతం.. ఇజ్రాయెల్ ప్రకటన!

Advertisement
 
Advertisement
Advertisement