
మహిళా జడ్జికి ఆగంతకుడి బెదిరింపు
రెవా(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లా మహిళా న్యాయమూర్తికి బెదిరింపు లేఖ అందింది. రూ.500 కోట్లు వెంటనే చెల్లించాలని, లేదంటే చంపేస్తామంటూ అందులో హెచ్చరించాడు. తియోంథర్ కోర్టు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మోహిని భదౌరియాకి రెండు రోజుల క్రితం స్పీడ్‌పోస్ట్‌లో ఈ లేఖ అందింది. తానొక భయంకరమైన నేరగాడినని, అడిగినంత ఇవ్వకుంటే ప్రాణాలు తీస్తానని అందులో ఆగంతకుడు బెదిరించాడని పోలీసులు తెలిపారు.
పొరుగునే ఉన్న యూపీలోని బరగా వద్దకు స్వయంగా వచ్చి ఇవ్వాలని అందులో డిమాండ్ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లేఖలోని పేరు ఆధారంగా ఆ ఆగంతకుడిని యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా లొహ్‌గారాకు చెందిన సందీప్ సింగ్‌గా తేల్చారు. ‘హనుమాన్’ అనే దొంగల ముఠాకు చెందిన వాడినని విచారణలో అతడు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు ప్రయాగ్‌రాజ్ పోలీసులు తెలిపారు.