ముంబై: పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. శివారు ప్రాంతమైన పింప్రి చించ్వాడ్‌లో ఈ ఘటన జరిగింది. పింప్రి చించ్వాడ్‌లోని వాన్వాడి ప్రాంతంలో అక్రమ మద్యం సేవించి గురువారం ఎనిమిది మంది మరణించగా.. ఇవాళ (శుక్రవారం) ఉదయం మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 11కి చేరింది. మద్యం సేవించిన తర్వాత బాధితులు స్పృహ తప్పి పడిపోయారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వారు మరణించినట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని స్థానిక ఎన్సీపీ నేత యోగేష్ బహాల్ డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారుల అండదండలతోనే అక్రమ, కల్తీ మద్యం బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని.,. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. 11 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దందాలో వారు కూడా భాగమయ్యారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, ఎండతీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పేర్కొంటూ... ఈ 11 మరణాలు కల్తీ మద్యం వల్లే జరిగాయని ధృవీకరించడానికి పోలీసులు నిరాకరించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారని.. దీని వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.


