breaking news
Toxic Liquor
-
‘సారా తాగితే చస్తారు’.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్
పట్నా: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ సారా మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. శరన్ జిల్లాలో బుధవారం కల్తీ సారా కాటుకు 21 మంది బలవగా.. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. వారంతా మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. సారాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష బీజేపీ సభ్యులు ఆరోపించారు. వారిపై సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు. తాగిన వారు చస్తారు.. జాగ్రత్త కల్తీసారా అంశంపై అసెంబ్లీ వేదికగా విపక్షాలపై మడ్డిపడ్డ సీఎం నితీశ్ కుమార్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మద్యం తాగుతారో వారు చనిపోతారు అంటూ పేర్కొన్నారు. ఛాప్రా కల్తీ సారా ఘటనపై మీడియాతో మాట్లాడారు నితీశ్. ‘లిక్కర్ తాగే వారు చనిపోతారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాపు(మహాత్మా గాంధీ) ఏం చెప్పారో మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? మద్యం ప్రమాదకరమని ఇంటింటికి తెలియజేస్తున్నాం. చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రజలే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. నిషేధం ఉన్న చోట లిక్కర్ అమ్ముతున్నారంటే.. అందులో ఏదో ఉన్నట్లు అర్థం. కొందరు తెలిసి తప్పులు చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు నితీశ్ కుమార్. ఇదీ చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి.. పలువురికి అస్వస్థత
పట్నా: కల్తీ మద్యానికి బిహార్‌లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా మరో ఆరుగురు మద్యం కాటుకు బలయ్యారు. ఛాప్రా జిల్లాలోని సరన్ ప్రాంతం ఐసౌపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోయిలా గ్రామంలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించిన క్రమంలో ఐదుగురు గ్రామంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. మరికొంత మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మృతులు సంజయ్ సింగ్, హరిందర్ రామ్, కునాల్ సింగ్, అమిత్ రంజన్లు సహా మరికొంత మంది కల్తీ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యారని మధురా డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా? అనే విషయంపై విచారిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రాణం తీసిన ప్రేమ?.. 80 రోజుల క్రితం అదృశ్యమై -
కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. మరో 10మందికి అస్వస్థత
గాంధీనగర్: కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా, రోజిడ్ గ్రామంలో సోమవారం జరిగింది. సుమారు 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ‘కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 21 మంది మరణించారు. మరో 10 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చేరారు. స్థానిక పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. రోజిడ్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొంత మంది ఆదివారం రాత్రి అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయమే ఇద్దరు మరణించారు. మిగిలిన వారు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలుగా పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి రోజిడ్ గ్రామంలో నాటు సారా తాగిన తర్వాత తన భర్త అనారోగ్యానికి గురైనట్లు ఓ మహిళ.. పోలీసులకు తెలిపింది. మరోవైపు.. ఆదివారం రాత్రి ఓ కొట్టులో నాటు సారా కొనుగోలు చేసిన తర్వాత సుమారు 25 మందికిపైగా అనారోగ్యానికి గురైనట్లు ఓ బాధితుడు తెలిపారు. సోమవారం సాయంత్రం బొటాడ్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించారు భవనగర్ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ యాదవ్. డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుజరాత్ పర్యాటనలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నాటు సారా అమ్ముతున్నట్లు ఆరోపించారు. ఇదీ చదవండి: గంజాయి తాగాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఉచిత సలహా! -
అసోంలో కల్తీ మద్యం కరాళనృత్యం
-
విశాఖలో ఘోర విషాదం..!
-
విశాఖలో ఘోర విషాదం..!
విశాఖపట్నం : జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఓ డబ్బాలోని గుర్తు తెలియని ద్రావణాన్ని మద్యంగా భావించిన కొందరు వ్యక్తులు దానిని సేవించారు. అది విషతుల్యమైనది కావడంతో ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన గురించి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ మీడియాతో మాట్లాడారు. బాధితులు తాగిన ద్రావణం ఏమిటో తెలియడం లేదని, దాంతో చికిత్సకు విఘాతం కలుగుతోందని అన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించామని తెలిపారు. ఘటనపై ఎక్సైజ్, పోలీస్ అధికారుల దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు. -
పాక్‌లో విష మద్యం తాగి 32 మంది మృతి
లాహోర్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో విషపూరిత మద్యం సేవించి 32 మంది మరణించారు. 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. టోబా టెక్ సింగ్ నగరంలోని ముబారకాబాద్ క్రైస్తవ కాలనీలో ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గత శనివారం వీరంతా మద్యాన్ని సేవించారు. మరుసటి రోజు ఉదయానికి కొందరు మరణించగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. ఘటనకు కారకులైన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తుకు విచారణ కమిటీని నియమించారు. పాక్‌లో ముస్లింలకు మద్యం అమ్మకం, వినియోగాలపై నిషేధం ఉండగా, మైనారిటీలు, విదేశీయులకు పలు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. గత మార్చిలో హోలీ వేడుకల్లో భాగంగా కల్తీ మద్యాన్ని సేవించడంతో 45 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో 35 మంది హిందువులున్నారు. -
కల్తీ మద్యం 22 మంది ప్రాణాలు తీసింది
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో కల్తీ మద్యం తాగి ఇద్దరు మహిళలు సహా 22 మంది మృతిచెందారు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని హైదరాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు మంగళవారం అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. కల్తీ మద్యం తాగిన మొత్తం 36 మంది అస్వస్థతకు గురవడంతో వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొంది. అయితే బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, 11 మందిని డిశ్చార్జి అయినట్టు లియాఖ్వాత్ యూనివర్సిటీ ఆస్పత్రి మెడికల్ సూపరిడెంట్ వాజిద్ మెమోన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లోని ముస్లింలు.. మద్యం సేవించడం, మద్యం అమ్మడం నిషేధించారు. కానీ, ముస్లిమేతరులకు మాత్రం లైసెన్స్ కలిగిన లిక్కర్ షాపుల్లో మద్యం కొనేందుకు అనుమతి ఉంది. -
కూలీ బతుకులను కాటేసిన కల్తీ మద్యం
- ఐదుగురి మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం - మొత్తం 34 మందికి అస్వస్థత - ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స - ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలో ఏరులై పారుతున్న కల్తీ మద్యం - నిండు ప్రాణాలు పోయేవరకు చోద్యం చూస్తున్న ఎక్సైజ్ పోలీసులు - మద్యం కల్తీ కాలేదని, నీళ్లలోనే ఏదో కలిసిందంటూ సర్కారు లీకులు - ఘటన బాధితులకు సీఎం పరామర్శ - మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా: సీఎం - ముఖ్యమంత్రి పరామర్శ సమయంలో బాధితుల ధర్నా - ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలో కల్తీ మద్యం ఐదు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఐదుగురు కూలీలు సోమవారం కల్తీ మద్యానికి బలయ్యారు. విజయవాడలోని కృష్ణలంకలోగల స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మొత్తం 34 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురు మరణించగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. నూతన రాజధాని ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. బార్లు ఉదయం 11గంటల తర్వాతే తెరవాలని నిబంధనలు ఉన్నా.. ఇక్కడ ఉదయం 8 గంటలకే తెరిచి విక్రయాలు ప్రారంభించడం గమనార్హం. రాష్ట్రంలో బార్లు 24 గంటలూ తెరిచే ఉంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం లేదని చెప్పేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కూలీలు చనిపోయింది కల్తీమద్యం వల్ల కాదని, నీళ్లలో ఏదో కలవడం వల్లనే వారు మరణించారని మీడియాకు లీకులిస్తోంది. సాక్షి, విజయవాడ: విజయవాడలోని కృష్ణలంక స్వర్ణబార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం ఉదయం కల్తీ మద్యం సేవించిన ఐదుగురు రోజువారీ కూలీలు మరణించారు. ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఐదుగురు మత్యువాత పడ్డారు. కృష్ణలంకలో నివాసం ఉండే వడ్రంగి కూలీ ఆకుల విజయ్‌కుమార్ (46), పోస్టాఫీసు వీధికి చెందిన రోజు కూలీ మునగాల శంకర్ (45), కృష్ణలంక ప్రాంతానికి చెందిన చిరుబండి వ్యాపారి నర్సా గోపి (48), న్యూ రాజరాజేశ్వరి పేటకు చెందిన వంటమాస్టర్ మీసాల మహేష్ (40), కృష్ణలంక నెహ్రునగర్ ప్రాంతానికి చెందిన మాదాసు నాంచారయ్య (60) మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రభుత్వాసుపత్రి చేరుకున్న మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ బార్లో చీప్‌లిక్కర్ సేవించిన ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోయాడు. అతిగా మద్యం సేవించడం వల్ల పడిపోయాడని అతనిని తీసుకువెళ్లి బయట పడుకోబెట్టారు. అయితే అరగంట వ్యవధిలో మరో 15 మంది ఇలానే పడిపోవటంతో బార్ నిర్వాహకులు, స్థానికులు 108కి, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. వారందరిని 108 సిబ్బంది విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన విజయవాడలో తీవ్ర కలకలం సృష్టించటంతో వందలాది మంది అక్కడ చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడకు భారీగా బలగాలను తరలించారు. బార్, లాడ్జి సీజ్ చేసిన పోలీసులు ఘటన నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకు నగర పోలీసులు బార్‌ను సీజ్ చేశారు. బార్‌తో పాటు పైఅంతస్తులో ఉన్న లాడ్జిని కూడా సీజ్ చేశారు. బార్లో పనిచేస్తున్న మేనేజర్ పి.వెంకటేశ్వరరావు, క్యాషియర్ ఎన్.నాగేశ్వరరావు, సైడ్ క్యాషియర్ ఆర్.మాలకొండారెడ్డి, అక్కడ పనిచేసే బాయ్ బి.శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం నిల్వల్ని కూడా సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో జిల్లాలో మద్యం షాపుల్ని మూసివేయించాలని కలెక్టర్ బాబు ఆదేశించారు. ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు కలిసి పలుచోట్ల షాపులను మూసివేయించారు. జిల్లాలోని బార్లు, వైన్ షాపులు అన్ని మూసివేయించి మద్యం విక్రయాలు నిలిపివేశారు. ఉదయం స్వర్ణ బార్లో సర్వ్ చేసిన చీప్‌లిక్కర్... ఒరిజినల్ ఛాయిస్, హేవార్డ్ మద్యం నిల్వలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్వర్ణ బార్‌తో పాటు విజయవాడ నగరం అంతా ‘బ్యాచ్ నెంబర్ 120’ సరఫరా అవుతోంది. దాంతో ఆ రకం మద్యం శాంపిల్స్‌ను తీసుకొని కాకినాడలోని ఎక్సైజ్ శాఖ రీజినల్ ల్యాబ్‌కు పంపారు. బాధితుల ధర్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రా హాస్పటల్లో బాధితులను పరామర్శిస్తున్న సమయంలో బాధితులతో కలిసి సీపీఎం, ఐద్వా నాయకులు బయట ధర్నా చేపట్టారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు హుటాహుటిన వ్యాన్‌ను రప్పించి సీపీఎం నాయకులను అదుపులోకి తీసుకుని తరలించారు. ఐద్వా నాయకురాళ్లు, బాధిత కుటుంబ మహిళలను అదుపులోకి తీసుకునేందుకు మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంతో పావుగంట సేపు మిన్నకుండి పోయారు. అనంతరం మహిళా కానిస్టేబుళ్లను తీసుకొచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌చేశారు. అంతకుముందు సీపీఎం కార్యకర్తలు బార్ వద్ద బైఠాయించి కొంతసేపు నినాదాలు చేశారు. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరుకొని క్యాజువాలిటీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఇవి సర్కారీ హత్యలు అంటూ నినదించారు. ప్రభుత్వం ఆదాయం కోసం ఎడాపెడా మద్యం షాపులకు అనుమతులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో పరామర్శకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను సీపీఎం నాయకులు కొంతసేపు ఘెరావ్ చేసి నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ సమాచారం తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వంగవీటి డిమాండ్‌చేశారు. అంతా అయోమయం.. జరిగిన ఘటనపై వాస్తవ విషయాలు వెల్లడించటంలో, వైద్య సేవలు అందించటంలో అంతా అయోమయం, గందరగోళం నెలకొంది. మృతుల సంఖ్యపై ఒక్కొక ఆధికారి ఒక్కో లెక్క చెప్పారు. చివరకు మృతదేహాలను మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి మిగిలిన వారిని మైరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న వారు కూడా చనిపోయారని పుకార్లు వ్యాపించడంతో బాధిత కుటుంబాలు తీవ్ర కలవరపాటుకు గురయ్యాయి. ఉదయం నుంచి స్వర్ణబార్‌లో మద్యం సేవించిన వారు 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ప్రభుత్వాసుపత్రిలో 24 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్, సెంటినీ హాస్పిటల్, రమేష్ హాస్పటల్, గన్నవరంలోని పీబీ సిద్ధార్థ వైద్యశాలలో 10 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రులు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్‌లు వేర్వేరుగా బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దోషులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ప్రత్తిపాటి మాట్లాడుతూ బాబు పాలనలో ఈలాంటి ఘటనలు చోటుచేసుకోవటం దురదృష్టకరమని చెప్పారు. మంత్రి కామినేని మాట్లాడుతూ బాధితులకు మైరుగైన చికిత్స అందించటానికి కార్పొరేట్ హస్పటల్స్కు పంపుతున్నామని చెప్పారు. మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ దోషుల్ని గుర్తించి వెంటనే శిక్షిస్తామని చెప్పారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్ మాట్లాడుతూ ఇది మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందిన బార్ అని, దీనిలో తప్పు ఎవరిదో నిర్ధారించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా రాత్రి 8గంటలకు బాధితులను పరామర్శించారు. మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: ఏపీ సీఎం విజయవాడ కల్తీమద్యం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తామని, మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మద్యం తాగితే విషమించిందా..నీళ్లలో కల్తీ జరిగిందా అనే అంశం తేలాల్సి వుందన్నారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు లోనై ఆంధ్రా హాస్పటల్లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం రాత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటన ఎలా జరిగిందనే దానిపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ బాధితులందరూ కష్టపడి పనిచేసి జీవనం సాగించేవారేనన్నారు. అయితే వారికి బార్లో ఏమి మద్యం ఇచ్చారో కూడా తెలియదంటున్నారని, మేము ఒక బ్రాండ్ అడుగుతాము, వారు గ్లాసులో పోసి ఇస్తారు. అంతేకానీ మాకు చూపించరని బాధితులు చెపుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వుంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని, గతంలో జరిగిన సంఘటనలపై కూడా దర్యాప్తు చేయిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆంధ్రాహాస్పటల్ ఎండీ పీవీ రమణమూర్తి, కలెక్టర్ బాబు. ఏ, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తదితరులు వున్నారు. -
కల్తీకల్లు తాగి ఒకరి మృతి
నిజామాబాద్: కల్తీకల్లు తాగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా భిక్నూర్ మండలం ఇసాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడిసె పెంటయ్య(60) మూడు రోజుల క్రితం కల్తీ కల్లు తాగి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిగా స్వస్థత చేకూరటంతో బుధవారం పెంటయ్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. అయితే బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా మృతి చెందాడు.